జీవా(Jiiva) అనే పేరు వినగానే మనకు పెద్దగా స్ట్రైక్ అవ్వకపోవచ్చు.. కానీ ‘రంగం’ సినిమా హీరో అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. ఆ సినిమాతో తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకున్న జీవా, ఆ తర్వాత సరైన హిట్లు లేక రేసులో కాస్త వెనకబడ్డాడు. మార్కెట్ డల్ అవ్వడంతో మన దగ్గర డబ్బింగ్ సినిమాలు కూడా తగ్గిపోయాయి. కానీ ఇప్పుడు ఎలాంటి అంచనాలు లేకుండా సంక్రాంతి బరిలో దిగి కోలీవుడ్‌లో సర్‌ప్రైజ్ హిట్టు కొట్టాడు.
నిజానికి ఈ పొంగల్ రేసులో హీరో కార్తి నటించిన ‘వా వాతియార్’ మీద భారీ అంచనాలు ఉన్నాయి. దానికి పోటీగా జీవా నటించిన కొత్త సినిమా ‘తలైవర్ తంబీ తలైమాయిల్’ (TTT) విడుదలైంది. ‘జన నాయకుడు’ సినిమా వాయిదా పడటంతో, ఆ గ్యాప్‌లో దీన్ని హడావిడిగా సెన్సార్ పూర్తి చేసి రిలీజ్ చేశారు. కట్ చేస్తే.. కార్తి సినిమాకు మిక్స్డ్ టాక్ రాగా, జీవా సినిమా మాత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. బుక్ మై షోలో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నావు.

ఈ సినిమా స్టోరీ లైన్ చాలా క్రేజీగా ఉంటుంది. ఒక పక్క ఊరి పెద్ద (ఇళవరసు) ఇంట్లో పెళ్లి హడావిడి.. సరిగ్గా అదే టైమ్‌లో వాళ్ల పక్కింట్లో (తంబి రామయ్య వాళ్ల నాన్న) చావు సంభవిస్తుంది. ఒక పక్క పెళ్లి బాజాలు, మరోపక్క శవయాత్ర.. ఈ రెండు కుటుంబాల మధ్య గొడవ పీక్స్‌కి వెళ్తుంది. ఈ గందరగోళాన్ని ఆ ఊరి పంచాయతీ ప్రెసిడెంట్‌గా ఉన్న హీరో (జీవా) ఎలా డీల్ చేశాడన్నదే కథ.
వినడానికి సీరియస్‌గా ఉన్నా, డైరెక్టర్ నితీష్ సహదేవ్ దీన్ని ఫుల్ లెంగ్త్ డార్క్ కామెడీగా మలిచారు. ‘ఫాలిమీ’ సినిమాతో నవ్వించిన నితీష్, ఇందులోనూ లాజిక్ లేని మనుషుల మధ్య జరిగే డ్రామాను హిలేరియస్‌గా చూపించారు.కేవలం 15 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం, మొదటి రెండు రోజుల్లోనే సుమారు 5 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. వారం తిరిగేసరికి పెట్టిన పెట్టుబడి వెనక్కి వచ్చేస్తుందని ట్రేడ్ వర్గాల అంచనా.ఈ రెస్పాన్స్ చూశాక, త్వరలోనే తెలుగులోనూ డబ్ చేసి రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉన్నారట.
