ఆది అనే హీరో ఉన్నాడు అనే విషయాన్ని ప్రేక్షకులు మెల్లమెల్లగా మర్చిపోతున్న తరుణమిది. “బుర్రకథ” లాంటి డిజాస్టర్ అనంతరం ఆది నటించగా విడుదలవుతున్న ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు కానీ.. ఈ సినిమా హిట్ అయితే ఆదికి మళ్ళీ మంచి రోజులు వస్తాయని ఇండస్ట్రీ మొత్తం మనస్ఫూర్తిగా కోరుకొంది. శ్రద్ధాశ్రీనాథ కథానాయికగా నటించిన ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడో పూర్తయినప్పటికీ.. ఎట్టకేలకు ఇవాళ విడుదలయింది. మరి ఈ సినిమాతోనైనా ఆది తన ఉనికిని చాటుకోగలిగాడా లేదా అనేది చూద్దాం..!!
కథ: కపిల్ (ఆది సాయికుమార్) ఓ మధ్య తరగతి యువకుడు. చక్కని కుటుంబం, మంచి ఉద్యోగం అన్నీ ఉన్నప్పటికి.. తండ్రి (సీనియర్ నరేష్) దురలవాట్ల కారణంగా ఎప్పటికప్పుడు సమస్యలు ఎదుర్కొంటూనే ఉంటాడు. అనుకోకుండా కాంచనమాల (శ్రద్దా శ్రీనాధ్)ను కలుస్తాడు ఆది. వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించి.. పెళ్లి వరకూ వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ.. కపిల్ తండ్రికి ఉన్న బెట్టింగ్ వ్యామోహం వారి ప్రేమకు బీటలు బారేలా చేస్తోంది. ఈ సమస్య నుంచి కపిల్ ఎలా బయట పడ్డాడు? తన తండ్రిని బెట్టింగుల నుండి ఎలా తప్పించాడు? చివరికి తన ప్రేమను ఎలా గెలుచుకున్నాడు? అనేది “జోడీ” కథాంశం.
నటీనటుల పనితీరు: ఆది నటన చూసి మెచ్చుకొన్నా.. అతడి స్క్రిప్ట్ సెలక్షన్ చూసి జాలిపడకుండా ఉండలేం. ఎలాంటి పాత్రనైనా రక్తి కట్టించగల సత్తా ఉన్నప్పటికీ అడ్డమైన కథలు ఒప్పుకోవడం వలన నటుడిగా సినిమా సినిమాకి దిగజారుతున్నాడు తప్పితే.. కథానాయకుడిగా తనకంటూ ఇమేజ్ కాదు కదా కనీసం ఉన్న కాస్త ఉనికిని కూడా కాపాడుకోలేకపోతున్నాడు. “జోడీ” ఎప్పుడో 80ల కాలంలో రావాల్సిన సినిమా. ఇలాంటి పూర్ స్క్రిప్ట్ సెలక్షన్ తో ఆది తన కెరీర్ ను కాపాడుకోవాలని ప్రయత్నించడం హాస్యాస్పదం.
నటిగా “జెర్సీ” సినిమాతోనే తన ప్రతిభను ఘనంగా చాటుకున్న శ్రద్ధ శ్రీనాథ్ ఈ చిత్రంలో నటిగా పర్వాలేదు అనిపించుకొంది కానీ.. లుక్స్ పరంగా మాత్రం యావరేజ్ గా ఉంది. రెండేళ్ల క్రితం షూట్ చేసిన సినిమా కావడం కూడా కారణంగా అయ్యి ఉండొచ్చు.
వెన్నెల కిషోర్, సత్యల కామెడీ ఫర్వాలేదు. గొల్లపూడి మారుతీరావు గార్ని ఒక పూర్తిస్థాయి పాత్రలో చూడడం ఆనందంగా ఉన్నప్పటికీ.. ఆయన పాత్రకి ఉన్న పెద్దతనం.. క్యారెక్టరైజేషన్ లో కొరవడడం బాధాకరం. నరేష్ తన పాత్రకు న్యాయం చేసాడు.
సాంకేతికవర్గం పనితీరు: ఫణి కళ్యాణ్ సంగీతం పర్వాలేదు అనిపించేలా ఉండగా.. విశ్వేశ్వర్ సినిమాటోగ్రఫీ కాస్త ఫ్రెష్ గా అనిపించింది. ప్రొడక్షన్ వేల్యూస్ కూడా పర్వాలేదు. ఇలా టెక్నీకాలిటీస్ అన్నీ బాగానే ఉన్నప్పటికీ.. కథ-కథనంలో నవ్యత లోపించడం అనేది సినిమాకి పెద్ద మైనస్. దర్శకుడు విశ్వనాథ్ రాసుకున్న కథ మరీ 80ల కాలం నాటి సినిమాలను తలపిస్తోంది. మరీ ముఖ్యంగా సినిమాలో అసలు కథ కంటే కొసరు కథలు (సబ్ ప్లాట్స్) ఎక్కువవడంతో.. స్క్రీన్ ప్లేలో క్లారిటీ లోపించడమే కాక.. ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెట్టినట్లవుతుంది.
విశ్లేషణ: నటుడిగా ఆదిని ప్రశంసించడమే కానీ.. విమర్శించే స్థాయిలో ఎప్పుడు లేడు. కానీ కథల ఎంపికలో కనీస స్థాయి జాగ్రత్తలు తీసుకోకపోవడంతో.. వరుసగా “బుర్రకథ, జోడీ” లాంటి సినిమాలు చేస్తున్నాడు. ఈ ఒరవడి నుండి బయట పడకపోతే.. తెలుగు ఇండస్ట్రీ ఒక మంచి నటుడ్ని కోల్పోవడం ఖాయం. ప్రయోగాత్మక చిత్రాలు చేయడానికి ఆదికి చాలా స్కోప్ ఉంది. మరి ఆ విధంగా ఆది ఎప్పుడు ఆలోచిస్తే.. ప్రేక్షకులు అప్పుడే ఆదిని కాస్త పట్టించుకొంటారు. లేదంటే కష్టమే.