తెలుగు రాష్ట్రాల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి అధిక సంఖ్యలో అభిమానులున్నారు. వీరు పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో బిజీగా పాల్గొంటుంటారు. తారక్ తాజా చిత్రం “జనతా గ్యారేజ్” చిత్ర బృందం ఇచ్చినా పిలుపు మేరకు ఫ్యాన్స్ ఎక్కువగా మొక్కలు నాటుతున్నారు. ప్రకృతి పరిరక్షణలో భాగస్వాములవుతున్నారు. ఈ సినిమా ఆడియో వేడుకలో యంగ్ టైగర్ తన కోసం డబ్బులు వృధా చేయవద్దని, ప్రజలకు ఉపయోగపడే పనులు చేయమని పిలుపునిచ్చారు.
అతని మాటకు విలువిచ్చిన అభిమానులు తమ సేవా గుణాన్ని చాటారు. మహబూబ్ నగర్ జిల్లా, మానవపాడ్ మండలంలోని పల్లె పాడ్ లో ఎన్టీఆర్ పేరిట బస్టాండ్ ని నిర్మించారు. ఈ చిన్న గ్రామంలో ప్రయాణికులు నీడ లేక చాలా రోజులుగా ఇబ్బందులు పడేవారు. ఈ విషయాన్నీ గుర్తించిన స్థానిక ఎన్టీఆర్ ఫ్యాన్స్ బస్టాండ్ ని నెలకొల్పారు. దానిపై ‘ఊరికి ప్రేమతో” అని రాసి తమ ఊరిపై ఉన్న అభిమానాన్ని చాటారు. ఈ బస్టాండ్ నిన్న (మంగళవారం) అందరికీ అందుబాటులోకి వచ్చింది. నందమూరి అభిమానులు ప్రజలకు అండగా నిలవడంలో ఎప్పుడు ముందుంటారని ఈ సంఘటన మరో మారు నిరూపించింది. కొరటాల శివ దర్శకత్వంలో తారక్ నటించిన జనతా గ్యారేజ్ చిత్రం రేపు (సెప్టెంబర్ 1) ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.