గతేడాది డిసెంబర్ నెలలో విడుదలైన పుష్ప, అఖండ సినిమాలు అంచనాలను మించి సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. నిర్మాతలకు ఈ రెండు సినిమాలు చెప్పుకోదగ్గ స్థాయిలో లాభాలను అందించాయి. ఏపీలో టికెట్ రేట్లు తక్కువగా ఉన్నా ఏపీ డిస్ట్రిబ్యూటర్లకు ఈ సినిమాలు ఎక్కువ మొత్తంలో నష్టాలను మిగల్చలేదు. అయితే 2022 సంవత్సరంలో విడుదలైన పెద్ద సినిమాలలో ఏ సినిమా కూడా నిర్మాతలకు భారీ లాభాలను అందించడం లేదు. భీమ్లా నాయక్ మూవీ కొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయితే మరికొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితులు కనిపించడం లేదు.
రాధేశ్యామ్ రెండు రోజుల్లో 100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించినా యావరేజ్ టాక్ రావడంతో కొన్ని ఏరియాలలో ఈ సినిమాకు నష్టాలు రావడం గ్యారంటీ అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది విడుదలైన సినిమాలలో బంగార్రాజు బ్రేక్ ఈవెన్ కాగా డీజే టిల్లు మాత్రమే భారీ స్థాయిలో లాభాలను అందించింది. అయితే చరణ్, తారక్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు సైతం ఆర్ఆర్ఆర్ మూవీ రిజల్ట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఆర్ఆర్ఆర్ మూవీపై ఊహించని స్థాయిలో అంచనాలు నెలకొనగా జక్కన్న ఈ సినిమాతో అంచనాలను అందుకోవాల్సి ఉంది. జక్కన్న కెరీర్ లో ఇప్పటివరకు ఫ్లాప్ లేదు. అయితే ఆర్ఆర్ఆర్ మూవీ విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన సినిమా కావడంతో చరణ్, తారక్ ఫ్యాన్స్ ఒకింత కంగారు పడుతున్నారు. చరణ్, తారక్ ఈ సినిమా కోసం ఏకంగా మూడేళ్లకు పైగా సమయం కేటాయించడం గమనార్హం.
ఈ సినిమాతో చరణ్, తారక్ కష్టానికి తగిన ఫలితం దక్కుతుందేమో చూడాల్సి ఉంది. దాదాపుగా 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది. రికార్డు స్థాయి స్కీన్లలో ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ కానుందని ప్రచారం జరుగుతోంది.