‘కన్నడ కంఠీరవ’ డా. రాజ్ కుమార్ తనయుడు, ‘కరుణాడ చక్రవర్తి’ డా, శివ రాజ్ కుమార్ సోదరుడు, కన్నడ ‘పవర్ స్టార్‘ స్వర్గీయ పునీత్ రాజ్ కుమార్ నటుడిగానే కాకుండా గొప్ప మానవతావాదిగానూ కర్ణాటక ప్రజల, అభిమానుల మనసుల్లో చెరుగని ముద్రవేశారు.. మరణానంతరం గౌరవార్దం ఆయనకు ‘కర్ణాటక రత్న’ పురస్కారం అందజేయనున్నట్లు కర్ణాటక ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా నేడు (నవంబర్ 1) ‘కర్ణాటక రాజ్యోత్సవ’ కార్యక్రమం బెంగుళూరులో జరుగుతోంది..
ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ రజినీ కాంత్, ఇన్ఫోసిస్ ఛైర్ పర్సన్ సుధా మూర్తి, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌లను ముఖ్య అతిథులుగా కర్ణాటక ప్రభుత్వం ఆహ్వానించింది. మంగళవారం మధ్యాహ్నం రజినీ, తారక్ బెంగుళూరుకి బయలుదేరడం.. అక్కడ ల్యాండ్ అవడానికి సంబంధించిన పిక్స్, వీడియోస్ విపరీతంగా వైరల్ అయ్యాయి.. కాగా ఈ కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ మరోసారి పెద్దల పట్ల తనకున్న గౌరవాన్ని చాటుకుని, అందరితోనూ ప్రశంసలందుకుంటున్నాడు.. వివరాల్లోకి వెళ్తే.. ‘కర్ణాటక రాజ్యోత్సవ’ ఈవెంట్ ప్రారంభంలో..
అతిథిగా విచ్చేసిన ఎన్టీఆర్‌ని కుర్చీలో కూర్చోమని కోరారు నిర్వాహకులు.. పునీత్ రాజ్ కుమార్ భార్య అశ్విని రాజ్ కుమార్ కూడా తారక్‌ని కూర్చోమని కుర్చీ చూపించారు. అయితే.. లేదు, లేదు.. ముందు మీరు కూర్చోండి అంటూ జూనియర్ ఎన్టీఆర్ కుర్చీలు శుభ్రం చేసి మరీ అశ్విని రాజ్ కుమార్, సుధా మూర్తిలను కూర్చోబెట్టాడు. తర్వాత అతిథులంతా కూర్చున్నారు. మహిళలకు గౌరవమిస్తూ తారక్ చేసిన ఈ పనికి అతణ్ణి అభినందిస్తూ.. ‘దటీజ్ ఎన్టీఆర్’ అంటూ వీడియో షేర్ చేస్తున్నారు ఫ్యాన్స్..
పునీత్ అంటే ఎన్టీఆర్‌కి ఎంతిష్టమో మొన్న అక్టోబర్ 29న పునీత్ ప్రధమ వర్థంతి సందర్భంగా మరోసారి అందరికీ తెలిసింది.. తారక్ తన ఇంటిలో పునీత్ ఫొటో పెట్టుకున్నాడు. ఎన్టీఆర్ ఇంట్లో పునీత్ ఫోటో అంటూ ఆ పిక్ నెట్టింట తెగ వైరల్ అయింది. ఆయనకి పునీత్ మీద ఇంత ప్రేమ ఉందా అంటూ పునీత్ ఫ్యాన్స్, తారక్ అభిమానులు భావోద్వేగానికి లోనయ్యారు. ఇప్పుడు ‘కర్ణాటక రాజ్యోత్సవ’ కార్యక్రమంలో తారక్ స్పీచ్ గురించి అందరూ ఎదురు చూస్తున్నారు..