కొన్ని సినిమాలు ఒక హీరో చేతి నుండి జారిపోయి మరో హీరో చేతికి వెళ్లడం.. అవి హిట్ లేదా ఫట్ అవ్వడం ఇలాంటివి మనం ఇదివరకు ఎన్నో చూశాము. మన జీవితాలని, అందులోని భావోద్వేగాలని, మన చుట్టూ ఉన్న పరిస్థితులను కథగా తెరమీదకు తీసుకువచ్చే చిత్రాలను ప్రేక్షకులు ఎక్కువ కాలం గుర్తుంచుకుంటారు. ఆ కోవకి చెందిందే స్టూడెంట్ నెంబర్ 1. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన కెరీర్ లో అందుకున్న మొట్టమొదటి సూపర్ హిట్ చిత్రం స్టూడెంట్ నెంబర్ 1.
అటు ఎస్ఎస్ రాజమౌళి కి కూడా ఈ సినిమా మంచి విజయాన్ని తెచ్చిపెట్టింది. ఈ చిత్రానికి తెలుగు ప్రేక్షకుల నుంచి అశేషమైన స్పందన లభించింది. ఈ చిత్రాన్ని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, భారీ చిత్రాల నిర్మాత సి అశ్వినీ దత్ నిర్మించారు. ఈ సినిమాలోని పాటలు కూడా ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. అయితే ప్రముఖ నిర్మాత చలసాని అశ్విని దత్ ఇటీవల “అలీతో సరదాగా” షోలో పాల్గొని ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
ఈ షోలో నిర్మాత అశ్విని దత్ మాట్లాడుతూ.. “2001లో ఈ చిత్రం అనుకున్నప్పుడు మొదట ప్రభాస్ తో చేయాలని అనుకున్నాం. ఈ సినిమాతోనే ప్రభాస్ ని టాలీవుడ్ కి పరిచయం చేద్దామనే దిశగా చర్చలు సాగుతున్న సమయంలో.. హరికృష్ణ గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. దీంతో మా ఆలోచన మారింది. ఇక చివరికి ప్రభాస్ ని కాదని ఎన్టీఆర్ ని తీసుకున్నాము” అని ఆసక్తికర విషయాలని పంచుకున్నారు నిర్మాత అశ్విని దత్.
ఆ తర్వాత 2002లో ఈశ్వర్ సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు ప్రభాస్. అయితే 2001లో విడుదలైన స్టూడెంట్ నెంబర్ 1 చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ విషయం తెలిసిన ప్రభాస్ అభిమానులు స్టూడెంట్ నెంబర్ 1 (Student No1) సినిమాలో ప్రభాస్ నటించిన ఉంటే ఎలా ఉండేదో.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.