ఒక సినిమా వస్తే.. అలాంటి కథ, కాన్సెప్ట్, సెట్టింగ్‌తో వరుసగా సినిమాలు రావడం చూస్తుంటాం. గతంలోనూ జరిగేవి, ఇప్పుడూ జరుగుతున్నాయి అని చెప్పాలి. ఇటీవల కాలంలో అలా వచ్చిన చిత్రం ఏదైనా ఉందా అంటే ‘కబ్జ’ అని చెప్పాలి. శాండిల్‌వుడ్ నుండి వచ్చిన ‘కేజీయఫ్’ సినిమాలను దాదాపుగా అనుకనించే ప్రయత్నం ఈ సినిమాతో చేశారు అని చెప్పొచ్చు. సెటప్ అండ్ ఫ్రేమ్స్ అలానే ఉన్నాయి అంటారు. ఈ విషయం పక్కనపెడితే..
సినిమాకు మాత్రం ‘కేజీయఫ్’ రిజల్ట్ రాలేదు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా? ఎందుకంటే ఈ సినిమాకు సీక్వెల్ తీస్తారట. అవును, మీరు చదివింది కరెక్టే.. ‘కబ్జ’ సినిమాకు సీక్వెల్ తీయాలని టీమ్ అనుకుంటోంది. ముందుగా చెప్పినట్లు ‘కేజీయఫ్’ని మక్కీకి మక్కీ దించినా.. కనీసం ఏ ఒక్క విభాగం, తారాగణం మెప్పించలేకపోయాయి. కన్నడలోనూ ఇదే పరిస్థితి. టీమ్ మొదటి మూడు రోజుల్లోనే రూ. వంద కోట్ల వసూళ్ల పోస్టర్ వేయడం గమనార్హం.
దీంతో ట్రోలింగ్‌కి కూడా ఈ సినిమా గురైంది. ఇంత జరిగినా దర్శకుడు చంద్రు, నిర్మాతలు సీక్వెల్‌కి రెడీ అయ్యారు. ‘కబ్జ 2’ సినిమాను తెరకెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. సినిమా స్క్రిప్ట్ లాక్ అయ్యిందని.. బెంగళూరు సినీ వర్గాల సమాచారం. మొదటి భాగంలో ఉపేంద్రతోపాటు సుదీప్, శివరాజ్ కుమార్ ఉన్నట్టుగా చూపించి మల్టీస్టారర్ అని అన్నారు. అయితే సినిమాలో వాళ్లు కాసేపే కనిపించారు.
అయితే ఇప్పుడు శివరాజ్ కుమార్ ఈ సినిమాలో హైలైట్ అవుతారు అని చెబుతున్నారు. ఇదంతా చూస్తుంటే ‘కబ్జ’ టీమ్‌ది కాన్ఫిడెన్షా లేక ఓవర్ కాన్ఫిడెన్సా అనేది తెలియడం లేదు. ఒక సబ్జెక్టును ప్రేక్షకులు రిజక్ట్ చేసినప్పుడు దానికి సీక్వెల్ అనడం ఎంతవరకు కరెక్ట్ అనేది తెలియడం లేదు. అయితే తొలి సినిమా తీసినంత భారీగా ఈ సినిమా కూడా తీస్తాం అని టీమ్ చెబుతోంది. చూడాలి సెట్స్ మీదకు వచ్చాక ఎలా ఉంటుందో?