Kaikala Satyanarayana: కైకాల సత్యనారాయణ తొలి రోజుల్లో ఎన్ని కష్టాలు అనుభవించారో..!

  • December 23, 2022 / 03:46 PM IST

కైకాల సత్యనారాయణ.. ఆ పేరు వింటేనే నిలువెత్తు విగ్రహం కళ్ల ముందు కదలాడుతుంది. యముడిగా ఆయన చేసిన నటన, అంత విగ్రహం కామెడీ చేస్తుంటే నవ్వి నవ్వి పొట్ట చెక్కలవుతుంది. విలనిజం విషయానికొస్తే.. బాబోయ్‌ ఇంత క్రూరంగా కూడా ఉంటారా మనుషులు అనిపిస్తుంది. దాంతో కైకాలకు లెక్కలేనన్ని అవార్డులు, రివార్డులు, ప్రశంసలు వచ్చాయి. అయితే ఇదంతా ఆయన నటుడిగా పేరు తెచ్చుకున్నాక. మరి అంతకుముందు ఎలా సాగింది. అందరు నటులులాగే ఆయన కూడా కష్టాలు పడ్డారా? ఓసారి చూద్దాం.

సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా కౌతవరంలో జన్మించారు. నాటకాల మీద అభిరుచితో ఎప్పటికైనా మంచి నటుడు అవ్వాలని కలలు కన్నారు. ఇంటర్మీడియట్‌ వయసులోనే నాటక సంస్థలతో రాష్ట్రమంతా తిరుగుతూ.. ‘పల్లె పడుచు’, ‘బంగారు సంకెళ్లు’, ‘ప్రేమ లీలలు’, ‘కులం లేని పిల్ల’, ‘ఎవరు దొంగ’ లాంటి నాటకాల్లో నటించారు. వాటిలోనూ విలన్‌గా, హీరోగా నటించి మెప్పించారు. అలా నాటకాలు వేస్తూ… 1955లో డిగ్రీ పూర్తి చేశారు. అయితే ఎంత వెతికినా.. ఉద్యోగం రాలేదు.

దీంతో రాజమండ్రిలో కుటుంబానికి ఉన్న కలప వ్యాపారం కొన్ని రోజులు చూసుకున్నారు. కొద్ది రోజులు అక్కడే ఉండి వ్యాపారం చూసుకుంటూ.. ఆ తర్వాత స్నేహితుడు కె.ఎల్‌.ధర్‌ సలహాతో సినిమా ప్రయత్నాల కోసం మద్రాసు వెళ్లిపోయారు. తొలుత ప్రసాద్‌ ప్రొడక్షన్స్‌లో సహాయ కళా దర్శకుడిగా కెరీర్‌ ప్రారంభించారు. అలా ‘కొడుకులు – కోడళ్లు’ అనే సినిమాలో నటుడిగా అవకాశం కోసం ప్రయత్నించారు. అక్కడ ప్రముఖ దర్శకనిర్మాత ఎల్‌.వి.ప్రసాద్‌… కైకాలకు స్క్రీన్‌ టెస్టులు చేశారు. అంతా ఓకే అనుకున్నా..

ఆ సినిమా ప్రారంభం కాలేదు. అయితే అవకాశం పోయింది కదా అని దిగులుపడకుండా.. పట్టు వదలని విక్రమార్కుడిలా కైకాల ప్రయత్నాలు కొనసాగించారు. కొద్ది రోజుల తర్వాత బి.ఎ.సుబ్బారావు సూచన మేరకు ప్రముఖ దర్శకనిర్మాత కె.వి.రెడ్డిని కలిశారు కైకాల. అక్కడ కూడా టెస్టులన్నీ అయిపోయాయి. కానీ సినిమా అవకాశం రాలేదు. ఆ సినిమానే ‘దొంగరాముడు’. కైకాల ఆ సినిమాలో వేసిన పాత్రను ఆర్‌.నాగేశ్వరరావు పోషించారు. అక్కడికి కొద్ది రోజులకు ‘సిపాయి కూతురు’ అనే సినిమాలో అవకాశం వచ్చింది.

అయితే ఆ సినిమా ఆశించిన విజయం అందుకోలేదు. దీంతో మళ్లీ ఖాళీ. అయితే ఆ సమయంలో మూడు సంవత్సరాల కాంట్రాక్టు మీద నెలకు రూ.300ల జీతానికి సత్యనారాయణ ఆ బ్యానర్‌లో పని చేసేందుకు ఒప్పుకున్నారు. దీంతో మరో సంస్థకు కైకాల వెళ్లే అవకాశం లేకపోయింది. అలా అని అక్కడే ఉన్నా అవకాశాలు లేకపోవడంతో కొన్ని సినిమాల్లో ఎన్టీఆర్‌కు డూపుగా కూడా నటించారు కైకాల.

అయితే 1960లో ‘సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి’ అనే సినిమా కైకాలకు ఎన్టీఆర్‌ అతిథి పాత్రలో నటించే అవకాశం ఇచ్చారు. అలా సత్యనారాయణ టాలెంట్‌ గుర్తించిన విఠలాచార్య ‘కనకదుర్గ పూజా మహిమ’ అనే సినిమా సేనాధిపతి పాత్ర ఇచ్చారు. ఆ సినిమాతో సత్యనారాయణ కెరీర్‌ నిలబడింది అని చెప్పుకోవచ్చు. అలా తన తొలినాటి రోజులు సాగాయి.

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus