 
                                                        మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా 150వ సినిమా ఆన్‌సెట్స్ ఉన్న సంగతి తెలిసిందే. వి.వి.వినాయక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం భారీ షెడ్యూల్ తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమాలో మెగాస్టార్ సరసన నటించే కథానాయిక ఎవరు? అన్న సస్పెన్స్ ఇన్నాళ్లు కొనసాగింది. చిరు సరసన పలువురు అగ్ర కథానాయికల పేర్లు వినిపించాయి. నయనతార, అనుష్క, శ్రియ .. వీరిలో ఎవరో ఒకరు నటించే ఛాన్సుందని కథనాలొచ్చాయి. అయితే వాటన్నిటికీ ఫుల్‌స్టాప్ పెడుతూ కాజల్‌ని ఫైనల్ చేశారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం రెండో షెడ్యూల్ చిత్రీకరణ కొనసాగుతోంది.
కాజల్ .. `సర్ధార్ గబ్బర్‌సింగ్`లో పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ సరసన నాయికగా నటించిన సంగతి తెలిసిందే. రామ్‌చరణ్ సరసన మగధీర, నాయక్, గోవిందుడు అందరివాడేలే చిత్రాల్లో ఆడిపాడింది. అలాగే బన్ని సరసన `ఆర్య-2`, `ఎవడు` చిత్రాల్లో నటించిన సంగతి విదితమే.
