కోలీవుడ్ కు రజినీ, కమల్ ఇద్దరూ రెండు కళ్ళు అని చెప్పుకోవచ్చు. ఇద్దరూ కె.బాల చందర్ ఫ్యాక్టరీ నుండీ వచ్చిన వారే..! ఇద్దరూ దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోలే..! మొదట్లో ఇద్దరూ కలిసి సినిమాలు చేసినప్పటికీ తర్వాత.. సెపరేట్ గా సినిమాలు చేస్తూ వచ్చారు. సినిమాల విషయంలో పోటీ పడినప్పటికీ వారి స్నేహం మాత్రం అలాగే కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. రాజకీయాల పరంగా కూడా వేరు వేరుగా ఉన్నప్పటికీ మా మధ్య స్నేహం మాత్రం ఎప్పటికీ అలానే ఉంటుంది అంటూ చెప్పుకొస్తున్నారు వీరిద్దరు..!
ఇటీవల కమల్ హాసన్ తన గురువు బాలచందర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సందర్భంగా ఆ వేడుకకు రజనీ కాంత్ కూడా విచ్చేసారు. కమల్‌తో కలిసి రజినీ బాలచందర్‌కు నివాళి అర్పించాడు. ఈ సందర్భంగా వీరి స్నేహ బంధం గురించి కమల్ మాట్లాడుతూ.. “రజనీ కెరీర్లో మైలరాయిలా నిలిచిపోయిన ‘దళపతి’ సినిమా నాటి సంగతుల్ని అందరితోనూ పంచుకున్నాడు. రజినీ మణిరత్నం దర్శకత్వంలో సినిమా చేస్తున్నానని నాకే ముందుగా చెప్పాడు. ఆ సినిమా పేరు ‘దళపతి’ అనే పేరు పెడుతున్నట్లు కూడా తెలిపాడు. అయితే ఆ టైటిల్ వినగానే నాకు నచ్చలేదు.. రజనీ పై కోపం వచ్చింది. ముఖం మీదే బాలేదు అని చెప్పడంతో రజనీ నొచ్చుకున్నాడు. ఐతే రజనీ చెప్పిన టైటిల్ నాకు ‘దళపతి’ అని కాకుండా ‘గణపతి’ అని వినిపించింది. అందుకే ఆ టైటిల్ బాలేదని అన్నాను. ఏదో వినాయక చవితి పండగలా ఉందని కూడా కామెంట్ చేను.. దీంతో రజనీకి అర్థం కాక మరోసారి టైటిల్ గురించి వివరిస్తే అప్పుడు నాకు ‘దళపతి’ అని అర్థమైంది. వెంటనే చాలా బాగుందని చెప్పాను. కొన్నేళ్ళ క్రితం రజనీ సినిమాలు మానేద్దామనుకుంటున్నట్లు కూడా చెప్పాడు. ఇలాంటి ఆలోచనలు ఎప్పుడూ పెట్టుకోకు అని నేను చెప్పాను. మా మధ్య స్నేహం చాలా గొప్పది” అంటూ కమల్ చెప్పుకొచ్చాడు.