కొన్నిసార్లు అనుకొని అంటామో, లేక అనుకోకుండా ఆ మాటలు వచ్చేస్తాయో కానీ.. నానా ఇబ్బందులు పెడతాయి. వీటికి మీకు జబర్దస్త్ ఉదాహరణ కావాలి అంటే.. కమల్ హాసన్ (Kamal Haasan) రీసెంట్‌గా చేసిన కొన్ని కామెంట్స్, వాటికి నెటిజన్లు, ప్రజల నుండి వస్తున్న రిప్లైలు, ట్రోలింగ్‌లు చూస్తే మీకే అర్థమవుతుంది. ఇటీవల తమిళనాడులో కల్తీ మద్యం బాధితుల్ని పరామర్శించడానికి వెళ్లిన కమల్ హాసన్ కొన్ని కామెంట్స్ చేశారు. ఇప్పుడవి ఆయనే ఇబ్బందిగా పరిణమించాయి.
కమల్ హాసన్ ఇటు సినిమాలు చేస్తూనే, అటు రాజకీయాల్లోనూ ఉన్నారు. మక్కల్ నీది మయ్యమ్ (MNN) పార్టీకి అధినేత ఆయనే. ఇటీవల తమిళనాడులోని కళ్లకురిచ్చిలో కల్తీ మద్యం వల్ల 56 మంది ప్రాణాలు కోల్పోయారు. 193 మంది ఆసుపత్రిలో చేరారు. ఈ నేపథ్యంలో బాధితుల కుటుంబాలను కమల్ హాసన్ పరామ్శించి, సంతాపం వ్యక్తం చేశారు. అయితే ఈ క్రమంలో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు ఇబ్బందికరంగా మారాయి. అక్రమం మద్యం గురించి పక్కన పెట్టి మద్యపానం గురించి ఆయన మాట్లాడారు.
కల్తీ మద్యం బాధితులు తమ హద్దులు దాటారని మనం అర్థం చేసుకోవాలని విషయాన్ని ఇంకోవైపు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. బాధితులు జాగ్రత్తగా ఉండాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అని సూచనలు చేశారు. బాధితులకు అవసరమైన కౌన్సెలింగ్ ఇచ్చేలా మానసిక వైద్య కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అక్కడితో ఆగకుండా ప్రజలు అప్పుడప్పుడే మద్యం తాగాలి కానీ.. ఎప్పుడు పడితే అప్పుడు తాగేసి లిమిట్ దాటకూడదు అని కోరారు.
కమల్ అలా మాట్లాడకుండా ఉండాల్సింది అని, ఆయన ఇటీవల జరిగిన ఎన్నికల్లో సపోర్టు చేసిన డీఎంకే పార్టీని వెనకేసుకొచ్చేందుకే అలా మాట్లాడారు అని బీజేపీ అంటోంది. మరోవైపు కమల్ కొత్త సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్న సమయంలో ఇలాంటి కామెంట్లు చేయడం, వాటికి రియాక్షన్ రావడం ఇబ్బందికరంగా మారింది. మరి దీనికి కమల్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి. ఆయన ఆలోచన మంచిదే అయినా.. ఇది ఆ మాటలు అనే టైమ్ కాదు అని రాజకీయ విశ్లేషకుల మాట.