స్కూల్ కి వెళ్లి అక్షరాలు దిద్దే వయసులోనే కమల్ హాసన్ సెట్స్ లో నటనలో పాఠాలు నేర్చుకున్నారు. స్టార్ గా నిరూపించుకోవడం కన్నా నటుడిగా పేరు తెచ్చుకోవడానికి తపించారు. ద్వి పాత్రాభినయం, త్రి పాత్రాభినయం చేయడానికే కష్టమయితే దశావతారంలో పది పాత్రలు పోషించి విశ్వనటుడు అని పేరు దక్కించుకున్నారు. అలా నటనే శ్వాసగా బతికే కమల్ హాసన్ ఇక తాను నటించబోనని ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చారు. ప్రస్తుతం బోస్టన్‌లో ఉన్న కమల్.. అక్కడ ఓ ప్రైవేట్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం వెల్లడించారు. ”నేను నటించిన రెండు సినిమాలు త్వరలో రిలీజ్ కానున్నాయి. వాటి తర్వాత నేను సినిమాలు చేయను. నేను నటుడిగా చనిపోవడానికి ఇష్టపడడం లేదు. ప్రజాసేవ చేసిన తర్వాతే తుది శ్వాస విడుస్తా.
అందుకే పూర్తిగా రాజకీయాలపైనే దృష్టి పెట్టాలని నిర్ణయం తీసుకున్నాను. ప్రజలు నిజాయితీగా బతికేందుకు ఎదో ఒకటి చేయాలని భావిస్తున్నాను. 37 ఏళ్లుగా నేను ప్రజా జీవితంలో ఉన్నాను. ఈ 37 సంవత్సరాలలో దాదాపు పది లక్షల మంది నిజాయితీపరులైన పనిమంతులను కలుసుకున్నాను. వారు నాతోనే ఉన్నారు.” అని వివరించారు. “బ్యాంక్‌లో నా అకౌంట్‌లు డబ్బులు వేసుకోవడానికి నేను రాజకీయాల్లోకి రాలేదు.” అని నేటి అవినీతి రాజకీయనాయకులకు చురకలు అంటించారు. ఈ నెలలోనే తన పార్టీ పేరును, విధివిధానాలను వెల్లడిస్తానని కమల్ హాసన్ చెప్పారు.