స్టార్ హీరో కమల్ హాసన్ పేరును ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన నటనతో కోట్ల సంఖ్యలో అభిమానుల హృదయాల్లో కమల్ హాసన్ స్థానం సంపాదించుకున్నారు. కమల్ తన సినీ కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో నటించి విజయాలను అందుకున్నారు. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు పాలిటిక్స్ లో కూడా కమల్ హాసన్ సత్తా చాటడానికి ప్రయత్నాలు చేశారు. కమల్ హాసన్ పార్టీ అయిన మక్కల్ నీది మయ్యం పార్టీ తరపున కమల్ తో పాటు ఎంతోమంది సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయగా కమల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి చేతిలో ఓటమిపాలయ్యారు.
వందల సంఖ్యలో సినిమాల్లో నటించిన కమల్ తన ఆస్తుల విలువ 176 కోట్ల రూపాయలు అని చెప్పుకొచ్చారు. కమల్ హాసన్ ఎన్నికల్లో కోయంబత్తూరు సౌత్ డివిజన్ నుంచి పోటీ చేశారు. ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి వచ్చిన సమయంలో తన ఆస్తులలో స్థిరాస్తుల విలువ 131.84 కోట్ల రూపాయలు అని చరాస్థుల విలువ 45.09 కోట్ల రూపాయలు అని కమల్ పేర్కొన్నారు. మన దేశంతో పాటు విదేశాల్లో కూడా కమల్ హాసన్ కు కోట్ల రూపాయల విలువ చేసే భవనాలు ఉన్నాయి.
కోట్ల రూపాయల విలువ చేసే కార్లను కమల్ హాసన్ కలిగి ఉన్నారు. తాను కేవలం 8వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నానని కమల్ హాసన్ పేర్కొన్నారు. తనకు 49.5 కోట్ల రూపాయల అప్పు ఉందని గతంలో కమల్ హాసన్ అఫిడవిట్ లో వెల్లడించారు. సినిమాలతో పాటు బిగ్ బాస్ షోకు హోస్ట్ గా వ్యవహరించడం ద్వారా కమల్ హాసన్ ఈ మొత్తాన్ని కూడబెట్టినట్టు తెలుస్తోంది.