మలయాళ, తెలుగు భాషల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకొన్న సాయిపల్లవి తన మాతృభాష తమిళంలో నటించిన మొదటి చిత్రం “దియా”. నాగశౌర్య, సాయిపల్లవి జంటగా నటించిన ఈ చిత్రాన్ని తెలుగులో “కణం” పేరుతో అనువదించారు. విజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఎమోషనల్ డ్రామా జనరల్ ఆడియన్స్ ను ఏమేరకు ఆకట్టుకుందో చూద్దాం..!!
కథ : కాలేజ్ వయసులోనే ప్రేమించుకొని ఒక పెద్ద తప్పు కారణంగా అయిదేళ్లు దూరంగా ఉండి మొత్తానికి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకొని ఒకటవుతారు కృష్ణ (నాగశౌర్య)-తులసి (సాయిపల్లవి). పెళ్లి అయ్యిందన్న ఆనందం కానీ, ప్రేమించినవాడ్నే పెళ్లాడానన్న సంతోషం కానీ తులసి ముఖంలో కనిపించవు. అందుకు కారణం ఏంటని కృష్ణ అడిగితే.. పెళ్ళికి ముందు నువ్ చేసిన తప్పే అని సమాధానమిచ్చి మిన్నకుండిపోతుంది తులసి. అయితే.. కృష్ణ-తులసిల వివాహం అనంతరం కృష్ణ తండ్రి, తులసి తల్లి, మావయ్యలు ఒక్కొక్కరిగా చనిపోతుంటారు. అందరి మరణాల్లోనూ కామన్ పాయింట్ ఊపిరాడకుండా చనిపోవడం.
అసలెందుకని వారు వరుసబెట్టి చనిపోతుంటారు? వారి మరణం వెనుక ఉన్న రహస్యం ఏమిటి? ఆ మరణాలకు కృష్ణ-తులసిలకు ఉన్న సంబంధం ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే “కణం” చిత్రం.
నటీనటుల పనితీరు : సాయిపల్లవి తన వయసుకు తగ్గ పాత్రలోనే నటించినప్పటికీ.. వయసుకు మించిన హావభావాలు పలికించింది. ఒక భార్యగా, తల్లిగా సాయిపల్లవి నటన ప్రశంసనీయం. ఎమోషనల్ సీన్స్ లో సాయిపల్లవి నటన సినిమాలో ఇంటెన్సిటీని విపరీతంగా పెంచింది. లేడీ ఆడియన్స్ సినిమాకి విశేషంగా కనెక్ట్ అవ్వడానికి సాయిపల్లవి మూల కారణం అవుతుంది. ఒక సగటు యువకుడిగా, భర్తగా నాగశౌర్య ఈ చిత్రంలో లుక్స్ పరంగా పర్వాలేదనిపించుకొన్నా.. సాయిపల్లవి కాంబినేషన్ సీన్స్ లో యాక్టర్ గా తేలిపోయాడు. అలాగే.. కొన్ని ఇంటెన్స్ సీన్స్ లో అభినయనాన్ని సరైన రీతిలో ప్రదర్శించలేకపోయాడు. ఇక క్లైమాక్స్ లో సాయిపల్లవి పెర్ఫార్మెన్స్ తో ఇరగదీస్తుంటే శౌర్య మాత్రం బ్లాంక్ ఫేస్ తో ఆడియన్స్ ను కన్ఫ్యూజ్ చేశాడు.
సాయిపల్లవి తర్వాత సినిమాలో ఆస్థాయిలో ఆకట్టుకొన్న నటి బేబీ వెరోనికా అరోరా. సినిమా మొత్తానికి మహా అయితే ఓ నాలుగు డైలాగులుంటాయి ఈ చిట్టి తల్లికి, కానీ కళ్ళతోనే అభినయించి ప్రేక్షకుల్ని తన పసితనంతో ఆకట్టుకొంది. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్స్ లో వెరోనికా పెర్ఫార్మెన్స్ మెయిన్ హైలైట్ అని చెప్పుకోవచ్చు. సినిమా మొత్తానికి కూడా వెరోనికా ప్రెజన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భయస్తుడైన పోలీస్ ఆఫీసర్ గా ప్రియదర్శి నటన కామెడీని క్రియేట్ చేయడం కోసం చేసిన విఫలయత్నాలు సినిమాకి మైనస్ అనే చెప్పాలి.
సాంకేతికవర్గం పనితీరు : “విక్రమ్ వేదా” చిత్రంతో సంగీత దర్శకుడిగా తన స్టామినాను ఘనంగా చాటుకొన్న సామ్ సి.ఎస్ “కణం” చిత్రంతో మారోమారు తన పనితనాన్ని ప్రూవ్ చేసుకొన్నాడు. పాటల కంటే ఎక్కువగా నేపధ్య సంగీతంతో ఆకట్టుకొన్నాడు. సినిమాలోని ఎమోషన్ ను అద్భుతంగా ఎలివేట్ చేశాడు. జంప్ స్కేర్ షాట్స్ లాంటివి ఒక్కటి కూడా లేని ఒక హారర్ డ్రామా మూవీ చూస్తున్న ప్రేక్షకుడ్ని భయపెట్టాలంటే చాలా కష్టమైన పని. కానీ.. సామ్ తన బ్యాగ్రౌండ్ స్కోర్ తో ఆ రేర్ ఫీట్ ను సక్సెస్ ఫుల్ గా ఫినిష్ చేశాడు.
నీరవ్ షా సినిమాటోగ్రఫీ మరో ప్రత్యేక ఆకర్షణ. ఆయన వాడిన ఫ్రేమింగ్స్, డ్రోన్ షాట్స్ కంటే ఎక్కువగా టింట్ ఎఫెక్ట్, లాంగ్ ఫ్రేమింగ్స్ ప్రేక్షకుడ్ని బాగా ఆకట్టుకొన్నాయి. సి.జి వర్క్ విషయంలో మాత్రం ఇంకాస్త జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది.
డైరెక్టర్ ఏ.ఎల్.విజయ్ రెగ్యులర్ హారర్ మూవీస్ తరహాలో సస్పెన్స్ ను మెయింటైన్ చేయకుండా స్ట్రయిట్ స్క్రీన్ ప్లేతో, పెద్దగా ట్విస్టులు లేకుండా కథనాన్ని నడిపి ప్రేక్షకుల్ని హారర్ ఎలిమెంట్స్ తో కంటే ఎమోషనల్ గా ఎక్కువగా ఆకట్టుకోవాలనుకొన్నాడు. బహుశా అదే అతను చేసిన పెద్ద తప్పు. ఎందుకంటే.. సినిమాలో అటు హారర్ ఎలిమెంట్స్ కానీ.. ఎమోషనల్ కంటెంట్ కానీ లేకపోవడంతో ప్రేక్షకులు దేనికీ కనెక్ట్ అవ్వరు. ముఖ్యంగా సాయిపల్లవి క్యారెక్టర్ ని డిజైన్ చేసిన విధానానికి అందరూ కనెక్ట్ అవ్వరు. అయితే.. క్లైమాక్స్ మాత్రం లాజికల్ గా మాత్రమే కాక సైంటిఫిక్ గానూ ఆడియన్స్ ను సాటిస్ఫై చేసిన విధానం మాత్రం అభినందనీయం. అయితే.. ఆఖరి 20 నిమిషాల కోసం మిగతా 80 నిమిషాలు సినిమాను భరించడం అనేది కాస్త కష్టమైన పనే.
విశ్లేషణ : “కణం” లాంటి ఎమోషనల్ హారర్ డ్రామా మూవీస్ లో సస్పెన్స్ అయినా ఉండాలి లేక హారర్ థ్రిల్ అయినా ఉండాలి. ఈ రెండు లేకుండా కేవలం ఎమోషన్ తో ఆకట్టుకోవాలని చేసిన ప్రయత్నం బెడిసికొట్టిందనే చెప్పాలి. అయితే.. క్లైమాక్స్ & సాయిపల్లవి, బేబీ వెరోనికా కోసం మాత్రం సినిమాని ఒకసారి చూడవచ్చు.