కన్నడ నటుడు రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో పోషించిన సినిమా ‘కాంతారా’. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ చిన్న సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. దేశవ్యాప్తంగా ఈ సినిమా రూ.400 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాలో కీలకపాత్ర పోషించారు నటుడు కిషోర్. ఫారెస్ట్ ఆఫీసర్ పాత్రలో అద్భుతంగా నటించారు. అయితే రీసెంట్ గా ఇతడు ‘కేజీఎఫ్’ సినిమాపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ‘కేజీఎఫ్’ సిరీస్ లో భాగంగా వచ్చిన రెండు సినిమాలు ఎంత పెద్ద సక్సెస్ అయ్యాయో తెలిసిందే.
ఈ సినిమాలను తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ ని దేశం మొత్తం పొగిడింది. హీరో యష్ కి కూడా ఈ సినిమాలు మంచి క్రేజ్ ని తీసుకొచ్చాయి. కానీ ‘కాంతారా’ నటుడు కిషోర్ మాత్రం ‘కేజీఎఫ్’ సినిమాను చూడకూడదని నిర్ణయించుకున్నాడట. ఎందుకంటే ఇలాంటి సినిమాలు తనకు అసలు నచ్చవట. నిజానికి ‘కాంతారా’తో పాటు ‘కేజీఎఫ్’ సినిమాలను నిర్మించింది కూడా హోంబలే ఫిలిమ్స్ సంస్థే. తాను ‘కేజీఎఫ్’ బ్రాండ్ కథా కథనాలకు అభిమానిని కాదని చెప్పిన కిషోర్.
అలాంటి మైండ్‌లెస్ సినిమాల కంటే తీవ్రమైన సమస్యలతో తెరకెక్కే చిన్న కంటెంట్ ఆధారిత సినిమాలకు మద్దతు ఇవ్వడాన్ని తాను ఇష్టపడతానని చెప్పారు. నటుడిగా కిషోర్ మంచి స్టేజ్ లో ఉన్నారు. ఈ మధ్యకాలంలో అతడికి భారీ సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. మణిరత్నం దర్శకత్వం వహించిన ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమాలో కూడా కీలకపాత్ర పోషించారు. ప్రస్తుతం ఇతడు బాలీవుడ్ లో ‘రెడ్ కాలర్’ అనే సినిమాలో నటిస్తున్నారు.
ఇది అతడికి హిందీ డెబ్యూ. ఈ సినిమాను చంద్రశేఖర్ బండియప్ప తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను బాలీవుడ్ డెబ్యూగా చూడనని.. తాము హిందీలో రూపొందిస్తోన్న సినిమా అంతేనని చెప్పుకొచ్చారు.