కన్నడకి చెందిన ‘కాంతారా’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. కర్ణాటకలోని ఒక ప్రాంతానికి సంబంధించిన ఆచార సంప్రదాయాల చుట్టూ తిరిగే సినిమా ఇది. ఈ సినిమాకి వచ్చిన బజ్ చూసి తెలుగు ఆడియన్స్ కూడా సినిమా చూడాలనుకున్నారు. వెంటనే సినిమాను డబ్ చేసి తెలుగులో రిలీజ్ చేశారు. ఈ సినిమాను డైరెక్ట్ చేసి, హీరోగా నటించిన రిషబ్ శెట్టి గురించి మనవాళ్లకు పెద్దగా తెలియదు. ఈ సినిమాకి తెలుగులో ప్రమోషన్స్ కూడా లేవు.
కేవలం మౌత్ టాక్ తో సినిమా దూసుకుపోతుంది. తెలుగు ఆడియన్స్ ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టారు. ఇప్పటికే తెలుగులో ఈ సినిమా రూ.50 కోట్లను వసూలు చేసింది. వరల్డ్ వైడ్ ‘కాంతారా’ రూ.300 కోట్ల గ్రాస్ ను దాటేసింది. అయితే ఈ సినిమా థియేట్రికల్ రన్ మీద నిర్మాతలు ఇంకా ఆశలు వదులుకోలేదు. కన్నడలో ఈ సినిమా విడుదలై ఐదు వారాలు అవుతుంది. ఇంకా అక్కడ సినిమా సత్తయ్య చాటుతూనే ఉంది.
తెలుగు, హిందీ భాషల్లో కూడా భారీ వసూళ్లు రాబడుతుండడంతో ప్రమోషన్స్ జోరు పెంచారు. దర్శకుడు,హీరో రిషబ్ శెట్టి ఈ సినిమా ప్రమోషన్స్ కోసం వివిధ రాష్ట్రాల్లో సక్సెస్ టూర్లు వేస్తున్నారు. ఈ సినిమాను మరింతగా జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమాకి భారీ సపోర్ట్ దొరికింది. దక్షిణాఫ్రికా లెజండరీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ ‘కాంతారా’ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. ఇండియన్స్ కూడా ఈ క్రికెటర్ ను బాగా ఇష్టపడతారు.
ఇటీవల ఆయన బెంగుళూరుకి రాగా.. వెంటనే రిషబ్ అతడిని కలిశారు. ఇద్దరూ కలిసి ‘కాంతారా’కి ఎలివేషన్ ఇచ్చారు. ఈ సినిమాను తప్పకుండా చూడాలని ఒక రీల్ కూడా చేశారు. ఒక లెజండరీ క్రికెటర్ ఇలా ప్రాంతీయ సినిమాను ప్రమోట్ చేయడం గొప్ప విషయమనే చెప్పాలి.