సినిమా హిట్, సూపర్ హిట్, బంపర్ హిట్, బ్లాక్ బస్టర్, ఇండస్ట్రీ హిట్.. ఇలా చాలా రకాలుగా చెప్పుకుంటూ వస్తారు. ఒకప్పుడు ఈ టాక్ వచ్చినప్పటి నుండి కలకాలం ఉండేది. ఆ తర్వాత సినిమా ఓటీటీలోకి వచ్చినా, టీవీలోకి వచ్చినా ఇదే టాక్ ఉండేది. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. థియేటర్లలో వచ్చిన టాక్.. ఆ తర్వాత ఓటీటీల్లోకి వచ్చినప్పుడు ఉండటం లేదు. ఒకవేళ అక్కడ ఉన్నా.
ఆ తర్వాత టీవీల్లోకి వస్తే అక్కడ ఉండటం లేదు. తాజాగా ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్న చిత్రం ‘సర్దార్’. కార్తి ద్విపాత్రాభినయంలో నటించిన చిత్రం ‘సర్దార్’. ఇటీవల టెలీకాస్ట్ అయిన ఈ సినిమాకు టీఆర్పీ కనీసం రెండు కూడా రాలేదు అని అంటున్నారు. బుల్లితెర వీక్షకుల అభిరుచి పూర్తిగా మారిపోయిందని ఈ మధ్య విశ్లేషకులు చెబుతున్నారు. వాళ్లు చెబుతున్నట్లుగానే. థియేటర్లలో హిట్ కొట్టిన సినిమాకు టీవీల్లో రేటింగ్ రావడం లేదు. దానికి ‘సర్దార్’ ఒకట ఉదాహరణ అని చెప్పొచ్చు.
ఎందుకంటే దీని టీఆర్పీ అంత దారుణంగా వచ్చింది కాబట్టి. ‘సర్దార్’ సినిమా థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చింది. మల్టీప్లెక్స్‌లు, బి సెంటర్లలో సినిమాకు మంచి వసూళ్లే వచ్చాయి. కానీ బుల్లి తెరపై అట్టర్ ఫ్లాప్ అయింది. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రసారమైన ఈ సినిమాకు కేవలం 1.48 టీఆర్పీ వచ్చిందని చెబుతున్నారు. ఈ సినిమా కంటే, రెగ్యులర్‌గా ప్రసారమయ్యే ‘బాహుబలి’, ‘మహర్షి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ లాంటి సినిమాలకు మంచి రేటింగ్ వచ్చిందని సమాచారం.
అయితే ఈ సినిమా విషయంలో జీ టీమ్ చేసిన ఓ ప్రయోగం కారణంగానే నెంబర్ తక్కువగా వచ్చింది అని అంటున్నారు. జీ మెయిన్ ఛానల్ అయిన జీ తెలుగులో కాకుండా జీ మూవీస్‌లో ఈ సినిమా ప్రీమియర్ వేశారు. ఆ ఛానల్‌ను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లే ప్రయత్నంలోనే ఈ పని చేశారు. దీంతోనే నెంబర్లు తక్కువగా వచ్చాయి అంటున్నారు.