సినిమాలో చెప్పిందంతా హీరోలు నిజ జీవితంలో చేస్తారా? అనే ప్రశ్న వస్తే 99 శాతం లేదు అనే చెప్పాలి. ఎందుకంటే అదేం రూల్ కాదు కాబట్టి. కానీ మనసుకు అనిపించి, సినిమాలో చెప్పింది చేసేవాళ్లు కొంతమంది ఉంటారు. వాళ్లను మిస్టర్ ఫర్‌ఫెక్షనిస్ట్‌లు అని, సూపర్‌స్టార్లకే స్టార్ అని పొగిడేయొచ్చు. తాజాగా ఇలాంటి పనే చేసి అందరికీ ఆదర్శం నిలిచే పని చేశాడు కథానాయకుడు కార్తి. ఇటీవల ‘సర్దార్’ సినిమాతో వచ్చిన కార్తి ఆ సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
బిగ్‌బాస్ తెలుగు షోకి కార్తి ఇటీవల ప్రత్యేక అతిథిగా హాజరయ్యాడు. హౌస్ మేట్స్‌తో కాసేపు ముచ్చటించి, సినిమా గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. అందులో భాగంగా సినిమా కథ విన్నాక తను ఎలా ఫీలయ్యాడు, ఏం చేశాడు, సినిమా గురించి ఎంత కష్టపడ్డాడు లాంటి వివరాలు చెప్పుకొచ్చాడు. అందులో భాగంగా ప్లాస్టిక్ బాటిల్స్‌లో నీరు తాగడం మానేసిన విషయం చెప్పుకొచ్చాడు. ‘సర్దార్’ సినిమాను చూసినవాళ్లకు ఈ విషయం క్లియర్‌గా అర్థమవుతుంది.
ఒకవేళ చూడకపోయుంటే ఈ కాన్సెప్ట్ అర్థం కాదు. ఎందుకంటే ఆ సినిమా నడిచేందంతా ఈ పాయింట్ మీదే. ఈ సినిమా కథను రెండేళ్ల క్రితం కార్తికి చెప్పారట దర్శకరచయిత మిత్రన్. మామూలు కథగా విన్న కార్తి.. ఆ తర్వాత కథలో లీనమైపోయాడట. సినిమాలో హుక్ పాయింట్ బాగా తలకు ఎక్కేసిందట. దీంతో ఇకపై బయట ప్లాస్టిక్ సీసాలో నీళ్లు కొనడం, తాగడం మానేశాడట. ఎక్కడికెళ్లినా ఇంట్లో నుండి నీళ్లు తీసుకెళ్లడం స్టార్ట్ చేశాడట. వాటినే తాగేవాడట. ఎందుకు అని అడుగుతున్నారా? అయితే మీరు సినిమా చూడలేదన్నమాటే.
ఆ విషయం అటుంచితే ఈ సినిమాలో కార్తి రెండు గెటప్స్‌లో కనిపిస్తాడు. ఒకటి ఓల్డేజ్, ఇంకొకటి యంగేజ్. ఓల్డేజ్ గెటప్ కోసం కార్తి మేకప్ వేసుకోవడానికి మూడు గంటలు పట్టేదట. కరోనా సమయంలోనూ అంతలా కష్టపడితేనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురాగాలిగామని కార్తి చెబుతున్నాడు. ఆ కష్టానికి ఇప్పుడొస్తున్న ఫలితం చాలా ఆనందాన్నిచ్చింది అని చెప్పాడు.