ఓటీటీ వేదికలను రచయితగా, దర్శకుడిగా తమలో మరో కోణాన్ని ఆవిష్కరించుకోవడానికి చాలామంది ఉపయోగించుకుంటున్నారు. సామాజిక సందేశాత్మక సినిమాలు తీసే క్రిష్ నుండి మోడరన్ వెబ్‌సిరీస్ ‘మస్తీస్’ వచ్చింది. బాలీవుడ్‌లో కరణ్ జోహార్ నుండి బోల్డ్ సిరీస్ ‘లస్ట్ స్టోరీస్’ ఎవరూ ఊహించి ఉండరు. ప్రేక్షకుల ఊహలకు అందని విధంగా ఓటీటీ వేదికలకు దర్శకులు కొత్త కంటెంట్ అందిస్తున్నారు. ఇప్పుడు చాలామంది దర్శకులు వెబ్ సిరీస్‌లు తీయడానికి ప్లాన్ చేస్తున్నారు. అందులో టాలీవుడ్‌లో మిస్టరీ థ్రిల్లర్ సిన్మా ‘కార్తికేయ’తో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు చందూ మొండేటి కూడా ఉన్నారు.
ఆయన ఒక కామెడీ వెబ్ సిరీస్ తీయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ‘కార్తికేయ’ తరవాత తన అభిమాన హీరో అక్కినేని నాగార్జున కుమారుడు నాగచైతన్యతో ‘ప్రేమమ్’ చేసే అవకాశం చందూ మొండేటికి వచ్చింది. అది విజయం సాధించింది. కానీ, ఆ తరవాత చేసిన ‘సవ్యసాచి’ ఆశించిన విజయం సాధించలేదు. దాని తరవాత కొంత విరామం తీసుకుని ‘కార్తికేయ’ సీక్వెల్ కోసం కథ సిద్ధం చేసుకున్నాడు. చిత్రీకరణ ప్రారంభించాలని రెక్కీ నిర్వహించి లొకేషన్లు సైతం ఫైనలైజ్ చేసుకున్న తరవాత కరోనా వచ్చి పడింది. ఈసారి అనుకోకుండా విరామం వచ్చింది.
ఈ సమయంలో వెబ్ సిరీస్ కోసం చందూ మొండేటి ఒక కామెడీ స్క్రిప్ట్ రాశారు. దాదాపుగా 45 రోజుల నుండి దాని మీద వర్క్ చేస్తున్నారు. రెండు మూడు వారాల్లో క్యాస్టింగ్ కూడా ఫైనలైజ్ చేస్తారట. వెబ్ సిరీస్ మాత్రమే కాదు. ‘కార్తికేయ 2’ తరవాత గీతా ఆర్ట్స్ సంస్థలో కూడా చందూ మొండేటి ఒక సినిమా చేయనున్నాడు. జీఏ2 బ్యానర్ మీద ఆ సినిమాను బన్నీ వాస్ ప్రొడ్యూస్ చేస్తారు.