‘కార్తికేయ’ ఫ్రాంచైజీ కొనసాగుతూనే ఉంటుంది అని ‘కార్తికేయ 2’ సినిమా ఆఖరున చెప్పేశారు. అది కూడా ఏదో మాట వరుసకు కాదు.. డాక్టర్ కార్తికేయ ఎక్కడికి వెళ్లాడు అని ప్రశ్న వేసి మరీ మరో కేసును ఛేదించినట్లు సీన్లతో చూపించేశారు. అంటే ‘కార్తికేయ 3’ విషయంలో టీమ్ ఎంత సీరియస్‌గా ఉందో చెప్పకనే చెప్పారు. ఇప్పుడు ‘కార్తికేయ 2’ వసూళ్లు, రెస్పాన్స్ చూశాక రెండో ‘కార్తికేయ’కి మించి మూడోది ఉండేలా చూసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు ‘కార్తికేయ 2’ వంద కోట్ల వసూళ్లవైపు దూసుకుపోతోంది.
‘కార్తికేయ’ సినిమా విడుదలకు ముందు ఎన్ని కష్టాలు పడిందో అందరికీ తెలుసు. ఎవరు కష్టపెట్టారు, ఎందుకు పెట్టారు అనే విషయం ఇప్పుడు చర్చనీయాంశం కాదు కాబట్టి.. కష్టపడింది అని చెప్పొచ్చు. అయితే ఆ కష్టాలు మొత్తం టీమ్.. ఇప్పుడు మరచిపోయింది అని చెప్పొచ్చు. ఎందుకంటే సినిమాకు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ. 75 కోట్ల గ్రాస్ వచ్చేసింది. ఈ వారాంతంలో రూ. 100 కోట్ల దగ్గరకు ఈ పరుగు వెళ్తుంది అని చెబుతున్నారు.
ఇక ‘కార్తికేయ’ ఫ్రాంచైజీ గురించి నిఖిల్ కూడా స్పందించాడు. ‘కార్తికేయ’ సిరీస్‌లో మూడో భాగం ఉంటుందా? అని అడిగితే, ‘కచ్చితంగా ఉంటుంది. సాహసాలను, సమస్యలను , మిస్టరీలను ఛేదించే ఉత్సాహం ఉన్న డాక్టర్ కార్తీక్ పాత్ర కొనసాగుతూనే ఉంటుంది. దేశ సంస్కృతిలో ఎవరికీ తెలియని ఎన్నో కథలు ఉన్నాయి. వాటిని స్ఫూర్తిగా తీసుకుని మరిన్ని భాగాలతో మీ ముందుకు వస్తూనే ఉంటాం’’ అని నిఖిల్ చెప్పాడు.
హిందీలో తొలి రోజు 50 స్క్రీన్‌లలోనే సినిమాను విడుదల చేశాం. ఇప్పుడు ఆ సంఖ్య వెయ్యికి పెరిగింది. రోజుకు మూడు వేల షోస్ పడుతున్నాయి. ఈ వారంలో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక ఈ సినిమా మన దేశంలోనే కాదు అమెరికాలోనూ మంచి వసూళ్లు రాబడుతోంది. అక్కడ ఈ సినిమా మిలియన్ డాలర్లను వసూలు చేసింది. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, అనుపమ్ ఖేర్, శ్రీనివాస రెడ్డి, వైవా హర్ష తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.