హీరో కార్తికేయ కొత్త చిత్రం 90ml లోని మొదటి పాట “ఇనిపించుకోరు ఇనిపించుకోరు” ఇటీవల విడుదలయి అబ్బాయిలకి తెగ నాచేస్తోంది .”ఇనిపించుకోరు ఇనిపించుకోరు అమ్మాయిలస్సలే ఇనిపించుకోరు” అంటూ సాగే ఈ పాట అమ్మాయిల ప్రవర్తనతో విసిగిపోయిన అబ్బాయిలందరి మాటలుగా రాహుల్ సిప్లిగంజ్ గాత్రంలో, చంద్రబోస్ సాహిత్యంలో, అనూప్ రూబెన్స్ సంగీతంలో అందరినీ ఆకట్టుకుంటోంది.
ఇప్పటికే విడుదలైన టీజర్ యూత్ ని విపరీతంగా ఆకట్టుకోవడం, `ఆర్ ఎక్స్ 100` వంటి బ్లాక్ బస్టర్ చిత్రం తీసిన కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై అశోక్ రెడ్డి గుమ్మకొండ `90 ఎం.ఎల్` సినిమా నిర్మిస్తుండడం ఈ చిత్రానికి ప్రస్తుతం కలిసొచ్చే అంశాలు.
దర్శకుడు శేఖర్ రెడ్డి ఎర్ర ఈ పాట గురించి మాట్లాడుతూ “జానీ మాస్టర్ ఆధ్వర్యంలో హీరో, 50 మంది డాన్సర్లతో 150 మంది జూనియర్ ఆర్టిస్టులతో కోకాపేటలో పెద్ద సెట్ వేసి 4 రోజులుచిత్రీకరించాం. ఈ పాటకి చంద్రబోస్ అందించిన సాహిత్యానికి తగ్గట్టుగానే కార్తికేయ స్టెప్స్ తో పాటు రాహుల్ సిప్లిగంజ్ గాత్రం కూడా తోడవడంతో పాటకి అనుకున్న దానికంటే ఎక్కువ ఆదరణ లభిస్తోంది . ఇక సినిమా విషయానికి వస్తే ఇందులో హీరో కార్తికేయ పోషిస్తున్న పాత్ర పేరు `దేవదాస్`, ఎంబీఏ గోల్డ్ మెడలిస్ట్. అంతటి విద్యావంతుడు ఆథరైజ్డ్ డ్రింకర్‌గా ఎందుకు అయ్యాడు అన్న కాన్సెప్ట్ చుట్టూ కథ తిరుగుతుంది? ఇందులో యూత్ కి మాత్రమే కాక ఫామిలీ ఆడియన్స్ కి కావాల్సిన అంశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి“ అన్నారు.
నిర్మాత అశోక్ రెడ్డి గుమ్మకొండ మాట్లాడుతూ “టీజర్‌ని బట్టే సినిమా ఎలా ఉంటుందో జనాలకి అర్థమైపోతుంది, ఇప్పుడు ఈ పాట కూడా అందుకు తగ్గట్టుగానే అబ్బాయిలకి కనెక్ట్ అయ్యే విధంగా ఉండడంతో సినిమా కాన్సెప్ట్ మీద మాకున్న నమ్మకం మరింత బలపడింది. ప్రస్తుతం సినిమా టాకీ పార్ట్ పూర్తయ్యింది. రెండు పాటల చిత్రీకరణ కోసం అజర్ బేజాన్ రాజధాని బాకు వెళ్తున్నాం.అనేక బాలీవుడ్ చిత్రాలు అక్కడ షూటింగ్ జరుపుకున్నాయి. ఇటీవల మన భారీ బడ్జెట్ తెలుగు సినిమాలు కూడా అక్కడ చిత్రీకరణ జరుపుకున్నాయి ” అని తెలిపారు .
`ఆర్ ఎక్స్ 100`, `హిప్పీ`, `గుణ369` చిత్రాలతో కథానాయకునిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ని సొంతం చేసుకున్న కార్తికేయ, ఇటీవలే `గ్యాంగ్ లీడర్`లో ప్రతినాయకునిగా కూడా నటించి మంచి మార్కులు సంపాదించుకున్నారు. అదే ఊపులో ఇప్పుడు 90ml తో మోడరన్ ‘దేవదాసు’ లా మారి మరో కొత్త అవతారంలో మన ముందుకి రాబోతున్నాడు.