‘జైభీమ్’ సినిమాతో సూర్యకు ఎన్ని ప్రశంసలు దక్కాయో తెలియదు కానీ… వివాదాలు, వాటితో వచ్చే వాదనలు, వార్నింగ్‌లు మాత్రం పెరిగాయి. రోజుకొకరు సూర్యను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. సూర్య క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ… గద్దిస్తున్నారు. దీనికి ప్రతిగా సినిమా పరిశ్రమ నుండి సూర్యకు మద్దతు పెరుగుతోంది. తాజాగా దక్షిణాది చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు కాట్రగడ్డ ప్రసాద్ స్పందించారు. ‘జైభీమ్’ చిత్రంలోని సన్నివేశాలు ‘వన్నియార్లు’ అనే వర్గాన్ని అవమానించేలా ఉన్నాయని ఆ సంఘం అధ్యక్షుడు అన్బుమణి రామదాస్ ఇటీవల ఆరోపించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో సూర్య క్షమాపణలు చెప్పాలని కూడా డిమాండ్ చేశారు. అయితే సూర్య ఎవరికీ క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదన్నారు కాట్రగడ్డ ప్రసాద్. వన్నియార్ సంఘం తెలిపిన అభ్యంతరంపై సూర్య ఇప్పటికే స్పందించి ఆ లోగోను తొలగించారని గుర్తు చేశారు. ఇప్పటికీ అన్బుమణి రామదాస్ తమకు.. సూర్య క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేయడం అర్థరహితమన్నారు. పేద ప్రజలు, గిరిజనులకు సూర్య ఎంతో సాయం చేశారని కాట్రగడ్డ గుర్తు చేశారు.
సూర్య సినిమాల విషయంలో రాజకీయాలు చేయడం సరికాదన్నారు. సినిమాలు, రాజకీయాలు వేరనే విషయాన్ని రాజకీయ నేతలు గుర్తుపెట్టుకోవాలని ఆయన సూచించారు.