Mom 2: తల్లి సినిమా సీక్వెల్‌లో కూతురు.. ఎవరో తెలుసా?
- July 29, 2026 / 01:59 PM ISTByFilmy Focus Desk
అతిలోక సుందరిగా పేరు గాంచిన ప్రముఖ నటి దివంగత శ్రీదేవి చివరి చిత్రం ‘మామ్’. ఈ సినిమా వచ్చేటప్పుడు అదే ఆమె ఆఖరి సినిమా అవుతుందని ఎవరికీ తెలియదు. తెలిసి ఉంటే ఈ సినిమాను కల్ట్ క్లాసిక్ హోదాతో ఇంకా ఎక్కువ ఆడించేసేవారేమో. ఆ విషయం వదిలేస్తే ఇప్పుడు ఈ సినిమాకు ఈ సీక్వెల్ రెడీ చేస్తున్నారు. అందులో ఆమె చిన్న కుమార్తె ఖుషీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మేరకు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
Mom 2
‘ది ఆర్చీస్’ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఖుషీ.. ఆ తర్వాత రెండు సినిమాలు చేసింది. అయితే అవేవీ ఆమెకు స్టార్ హోదాను కాదు కదా.. విజయాన్ని కూడా అందించలేకపోయాయి. అవే ‘నాదానియా’, ‘లవ్‌యాపా’. దీంతో ఈసారి సినిమా వాటికి మించి ఉండాలి అనే ఉద్దేశంతో గతేడాదిగా కొత్త సినిమాకు ఓకే చెప్పలేదు. ఇప్పుడు ఫైనల్లీ సినిమాను ప్రకటించారు. అదే ‘మామ్ 2’. గిరీశ్ కోలీ దర్శకత్వంలో, బోనీ కపూర్ నిర్మిస్తున్న ఈ సినిమాను నోయిడా, గ్రీస్ ప్రాంతాల్లో చిత్రీకరించారు. ఈ ఏడాది నవంబరులో థియేటర్లలో విడుదల చేసే ప్రయత్నాల్లో ఉన్నారు.

ఖుషీ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో జిషు సేన్‌గుప్తా, కరిష్మా తన్నా కీలక పాత్రధారులు. ‘మామ్’ సినిమా కథను కొనసాగింపుగా ఈ సినిమా ఉండబోతోంది అని సమాచారం. ఇక ‘మామ్’ విషయానికొస్తే.. రవి ఉడయవార్ దర్శకత్వంలో 2017లో వచ్చిన సినిమా ఇది. 2018 ఫిబ్రవరిలో ఆమె కన్నుమూసిన తర్వాత ఈ చిత్రంలో నటనకుగాను ఉత్తమ నటిగా జాతీయ పురస్కారం లభించింది. సినిమాలో ఆమె నటన అదిరిపోయింది అనే ప్రశంసలూ ఉన్నాయి.
మరిప్పుడు అలాంటి గొప్ప సినిమాకు సీక్వెల్ చేయడం అంటే ఖుషీకి పెద్ద టాస్కే. మరి దీన్ని ఆమె ఏ విధంగా నెగ్గుకొస్తుంది అనేది చూడాలి. ఈ సినిమా కోసమే ఆమె గత కొన్ని నెలలుగా ఎన్ని కమర్షియల్ కథలు వస్తున్నా, స్టార్ హీరోల సినిమాల ఛాన్స్‌లు వస్తున్నా ఓకే చేయలేదట.













