కియారా అద్వానీ.. తెలుగు ప్రేక్షకులకి సుపరిచితమే. ‘భరత్ అనే నేను’ సినిమాతో ఈమె టాలీవుడ్ డెబ్యూ ఇచ్చింది. ఆ తర్వాత రాంచరణ్ ‘వినయ విధేయ రామ’ ‘గేమ్ ఛేంజర్’ వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. అయితే ‘భరత్ అనే నేను’ తప్ప మిగిలిన 2 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. కానీ హిందీలో మాత్రం కియారా స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇదిలా ఉండగా.. తాజాగా కియారా టీం ఓ గుడ్ న్యూస్ చెప్పింది.
కియారా అద్వానీ – సిద్ధార్థ్ మల్హోత్రా దంపతులు తల్లిదండ్రులుగా ప్రమోట్ అయ్యారు. తాజాగా కియారా అద్వానీ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ముంబైలో ఉన్న రిలయన్స్ హాస్పిటల్‌లో కియారా అద్వానీకి డెలివరీ అయినట్టు తెలుస్తుంది. డెలివరీ అనంతరం తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారట.
2023 ఫిబ్రవరి 7న సిద్దార్థ్- కియారా..ల వివాహం జరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో తల్లిదండ్రులు కాబోతున్నట్లు ఈ జంట ప్రకటించింది. వీరిది ప్రేమ వివాహం అనే సంగతి తెలిసిందే. రాజస్థాన్‌లో వీరి వివాహం అంగరంగవైభవంగా జరిగింది. ‘షేర్షా’ సినిమా షూటింగ్ టైంలో సిద్ధార్థ్, కియారా..ల మధ్య ఏర్పడ్డ పరిచయం తర్వాత స్నేహంగా అటు తర్వాత ప్రేమగా మారింది. ‘కాఫీ విత్ కరణ్’ షో ద్వారా వీరి లవ్ స్టోరీ బయటపడింది.
ఇటలీలో వీరు ఒకరికొకరు ప్రపోజ్ చేసుకున్నట్లు తెలిపింది. త్వరలో రాబోతున్న ‘వార్ 2’ సినిమాతో ప్రేక్షకులను పలకరించనుంది కియారా. ఇక సిద్దార్థ్ – కియారా దంపతులు తల్లిదండ్రులు కావడంతో సోషల్ మీడియాలోని నెటిజన్లు తమ బెస్ట్ విషెస్ ను తెలియజేస్తున్నారు.