చరణ్ పై అభినందనలు కురిపిస్తున్న కైరా అద్వానీ.!
- April 28, 2018 / 10:11 AM ISTByFilmy Focus
క్రికెటర్ ధోనీ బయోపిక్ మూవీ ద్వారా వెండితెరపై అడుగుపెట్టిన కైరా అద్వానీ.. భరత్ అనే నేను సినిమా ద్వారా తెలుగులోకి అడుగుపెట్టింది. తొలి చిత్రంతోనే తెలుగువారి మనసులు గెలుచుకుంది. ఈ సినిమా రిలీజ్ కాకముందే మరో భారీ ప్రాజక్ట్ లో అవకాశం దక్కించుకుంది. బోయపాటి శ్రీను, రామ్ చరణ్ తేజ్ కలయికలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ అందుకుంది. అలాంటి పిల్లని లక్కీ గర్ల్ అని పిలవకుండా బతకనేర్చిన భామ కైరా అంటూ ఫిలిం నగర్ వాసులు ట్యాగ్ తగిలించారు. ఆ పేరు పెట్టడానికి వెనుక బలమైన కారణమే ఉంది. భరత్ అనే నేను సినిమా ప్రచార కార్యక్రమాల్లో మహేష్ ని సార్ అని, నమ్రత ని మేడం అంటూ పిలిచి వారిని కూల్ చేసింది.
ఇక రామ్ చరణ్ తో కలిసి నటించకముందే.. అతనిపై ప్రసంశలు గుప్పించి కాకా పడుతోంది. భరత్ అనే నేను హిట్ అయిన సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ..”రామ్ చరణ్ గురించి చాలా విన్నాను. అతని సినిమాలో భాగం కావడం ఆనందంగా ఉంది. చరణ్ తో సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా? అని ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను” అని చెప్పి మెగా ఫ్యామిలీని పడగొట్టింది. ఆమె మాటలు విన్న సినీ విశ్లేషకులు గట్టి ఆలోచనతోనే కైరా టాలీవుడ్ లో అడుగుపెట్టినట్టు ఉందని చెప్పుకుంటున్నారు. చరణ్ సినిమా కంప్లీట్ కాకముందే మరో రెండు సినిమాలు ఆమె చేతిలోకి రావడం ఖాయమని అంచనా వేస్తున్నారు.
















