సినిమా విజయం ఇచ్చే కిక్ ఎలా ఉంటుందో మనం చాలాసార్లు చూసుంటాం. వరుస పరాజయాల తర్వాత వచ్చే విజయం వచ్చే కిక్ కూడా చూసుంటాం. అయితే ఆ విజయం ఇచ్చే ఫీల్‌ను అనుభవించే వాడి మనసు ఎలా ఉంటుందో మనం చెప్పలేం. వారి ఆనందాన్ని మాటల్లో చెబితేనో, అక్షరాల్లో రాస్తేనే తెలుస్తుంది. తాజాగా ఇలాంటి ఓ ప్రేమలేఖ రాశాడు యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) . దీపావళి సందర్భంగా వచ్చిన సినిమాల్లో దాదాపు అన్నీ మంచి విజయమే అందుకున్నాయి.
Kiran Abbavaram
అయితే కిరణ్ అబ్బవరానికి వచ్చిన విజయం చాలా స్పెషల్. ఆయన మీద ఏకంగా సినిమాల్లోనే ట్రోల్స్ వేశారు అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ‘నేనేం పాపం చేశాను.. నన్నెందుకు టార్గెట్ చేశారు’ అని కిరణే అన్నాడంటే ఎలా హర్ట్ అయ్యాడో తెలుస్తుంది. అలాంటి కిరణ్‌కు దక్కిన విజయానికి అందరూ ఆనందంగా ఉన్నారు. ఈ విషయాన్ని తనదైన శైలిలో ఓ నోట్ ద్వారా తెలియజేశాడు కిరణ్ అబ్బవరం. ‘‘ఎవరికైనా హిట్ వస్తే హిట్ కొట్టాడు అంటారు.
కానీ నాకు హిట్ వస్తే హిట్ కొట్టేశాం అంటున్నారు. ‘క’ (KA) సినిమా సాధించిన విజయం కంటే మీరు నాపై చూపిస్తున్న ప్రేమ, ఆత్మీయత మరింత సంతోషాన్ని ఇస్తోంది. ఇంతమంది ప్రేమ పొందిన నేను అదృష్టవంతుడిని. అందరికీ కృతజ్ఞతలు’’ అని తన నోట్‌లో రాసుకొచ్చాడు కిరణ్ అబ్బవరం. సినిమా విషయానికొస్తే.. అభినయ వాసుదేవ్ (కిరణ్ అబ్బవరం) ఓ అనాథ. ఎప్పటికైనా తన తల్లిదండ్రులు తిరిగొస్తారన్న ఆశతో జీవిస్తుంటాడు.
ఇతరులకు వచ్చే, ఇతరులు రాసే ఉత్తరాలు చదువుతూ.. వాటిని తన సొంత వాళ్లే రాసినట్లు ఊహించుకుంటూ ఉంటాడు. కొన్ని పరిణామాల తర్వాత కృష్ణగిరికి వచ్చి కాంట్రాక్ట్ పోస్ట్‌మెన్‌గా ఉద్యోగంలో చేరతాడు. వచ్చాక అతని జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి, ఆ ఊరిలో మిస్టరీగా మారిన అమ్మాయిల మిస్సింగ్ వ్యవహారంలోకి వాసుదేవ్ ఎలా వస్తాడు? వచ్చాడ ఏం చేశాడు అనేదే కథ.