కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) ‘క’ (KA) సినిమాతో హిట్టు కొట్టి ప్లాపుల నుండి బయటపడ్డాడు. గతేడాది చివర్లో రిలీజ్ అయిన ‘క’ కిరణ్ ఊహించిన దానికంటే మంచి విజయాన్నే అందుకుంది. దీంతో అతని నెక్స్ట్ సినిమా ‘దిల్ రుబా’ (Dilruba) పై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. వాస్తవానికి ‘క’ కంటే ముందుగానే ‘దిల్ రుబా’ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. కానీ దానికి బడ్జెట్ అనుకున్న దానికంటే ఎక్కువైపోయింది. కిరణ్ ప్లాపుల్లో ఉన్న టైంలో ఈ సినిమా బడ్జెట్ కి తగ్గట్టు బిజినెస్ జరగడం కష్టం.
అందుకే దీన్ని పక్కన పెట్టి.. ముందుగా ‘క’ ని వదిలారు. ఇది ఒక లవ్ స్టోరీ. విశ్వ కరుణ్ (Vishwa Karun) .. ఈ చిత్రానికి దర్శకుడు. టీజర్ మొత్తం పూరి జగన్నాథ్ సినిమాల స్టైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఈ సినిమాని ఫిబ్రవరి 14నే రిలీజ్ చేయాలి అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా వేశారు. ఇక ఈరోజు చిత్ర బృందం విడుదల తేదీని ప్రకటించింది. మార్చి 14న ఈ సినిమా రిలీజ్ కాబోతున్నట్టు ప్రకటించారు.
అంటే దాదాపు నెల రోజులు పోస్ట్ పోన్ అయ్యింది అని మనం అర్థం చేసుకోవచ్చు. మార్చి నెలలో పెద్ద సినిమాలు ఏమీ రిలీజ్ కావడం లేదు. కాబట్టి.. ‘దిల్ రుబా’ కి ఆల్మోస్ట్ సోలో రిలీజ్ దక్కినట్టే అని చెప్పాలి. కాకపోతే పరీక్షల సీజన్ కాబట్టి.. ‘దిల్ రుబా’ కి ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి. సామ్ సి ఎస్ (Sam C. S.) మ్యూజిక్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇక వచ్చే వారం నుండి ‘దిల్ రుబా’ ప్రమోషన్స్ షురూ కాబోతున్నట్లు తెలుస్తుంది.