నిఖిల్ హీరోగా నటించిన తాజా చిత్రం “కిరాక్ పార్టీ”. కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన “కిరిక్ పార్టీ”కి రీమేక్ గా రూపొందిన ఈ చిత్రానికి శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించగా.. చందు మొండేటి, సుధీర్ వర్మలు స్క్రీన్ ప్లే, డైలాగ్స్ సమకూర్చడం విశేషం. “కేశవ” తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకొన్నాడు నిఖిల్. మరి నిఖిల్ ఆశలు నెరవేరాయో లేదో చూద్దాం..!!
కథ : జీవితంలో పెద్దగా గోల్స్ ఏమీ లేకుండా చాలా సరదాగా స్నేహితులతో, కాలేజ్ గొడవలతో కాలాన్ని వెళ్లదీసే మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ కృష్ణ (నిఖిల్). అందరిలాగే గ్యాంగ్స్ మెయింటైన్ చేయడం, సీనియర్స్ తో గొడవలు పడడం, కాలేజ్ టాప్ బ్యూటీకి లైన్ వేయడం వంటివి చేస్తుంటాడు. వాటిలో భాగంగానే తాను తొలిచూపులోనే ఇష్టపడ్డ మీరా (సిమ్రాన్) ప్రేమను దక్కించుకోవాలనుకొంటాడు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ మొదలయ్యిందని సంతోషించేలోపు.. ఒక చిన్న తప్పు వల్ల మీరా సడన్ గా చనిపోతుంది. ఆ బాధతో కొన్నాళ్లపాటు కాలేజ్ కి, ఫ్రెండ్స్ కి దూరంగా సింగిల్ గా జర్నీ చేసి మొండి కృష్ణలా మారిపోతాడు. ఆ మొండోడ్ని ఇష్టపడుతుంది సత్య (సంయుక్త హెగ్డే). ప్రిన్స్ పాల్ కూతురైన సత్య తన ప్రేమను కృష్ణకి తెలియజేయగలిగిందా? మీరా హేంగోవర్ నుంచి కృష్ణ బయటపడగలిగాడా? తిరిగి మళ్ళీ తన స్నేహితులతో, సత్యతో కలిశాడా? అందుకోసం అతడు పడిన మానసిక వేదన ఎలాంటిది అనేది “కిరిక్ పార్టీ” కథాంశం.
నటీనటుల పనితీరు : నిఖిల్ ఈ సినిమాలో రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న రోల్ ప్లే చేశాడు. యంగ్ స్టూడెంట్ గా “హ్యాపీడేస్” సినిమాలో నటించిన అనుభవం ఉండడంతో ఆ షేడ్ వరకూ పర్వాలేదనిపించుకొన్నాడు. అయితే.. రగ్గడ్ లుక్ మాత్రం అంతగా సూట్ అవ్వలేదు. బాడీ పెంచడం వరకూ బాగానే ఉంది కానీ.. మీసకట్టు విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది. హీరోయిన్లుగా నటించిన సిమ్రాన్, సంయుక్తలు సినిమాకి గ్లామర్ ను జోడించలేకపోవడమే కాదు పాత్రలకు న్యాయం చేయలేకపోయారు. సిమ్రాన్ నీరసంగా కనిపిస్తే.. సంయుక్త నటనలో ఎనర్జీ కంటే అతి ఎక్కువగా కనిపించింది. ఫ్రెండ్ రోల్స్ లో నటించిన యువకులందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతికవర్గం పనితీరు : కన్నడ వెర్షన్ కు వర్క్ చేసిన అజనీష్ లోక్నాధ్ తెలుగు వెర్షన్ కి కూడా వర్క్ చేయడం ప్లస్ పాయింట్ అయ్యింది. పాటలు సేమ్ టు సేమ్ ఉండగా.. నేపధ్య సంగీతంతో మాత్రం అలరించాడు. అద్వైత గురుమూర్తి సినిమాటోగ్రఫీ, కెమెరా బ్లాక్స్ బాగున్నాయి. కాలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీ కావడంతో యూత్ ని ఎక్కువగా ఎట్రాక్ట్ చేసే ఫ్రెమ్స్, లైటింగ్ ఆడియన్స్ కు నచ్చుతాయి. ఒరిజినల్ వెర్షన్ స్క్రీన్ ప్లేని కంప్లీట్ గా తెలుగుకి తగ్గట్లుగా సుధీర్ వర్మ మార్చేశాడు. అయితే.. సోల్ మిస్ అయ్యింది. రన్ టైమ్ తగ్గించడం మంచి ఐడియానే కానీ.. మరీ కథాగమనాన్ని దెబ్బతీసాయి. చందు మొండేటి డైలాగ్స్ సినిమాకి ప్లస్ అయ్యాయి. కామెడీ పంచస్ అండ్ సింగిల్ లైన్స్ ప్రేక్షకుల్ని బాగా నవ్విస్తాయి.
దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి ఒరిజినల్ వెర్షన్ ను దగ్గర పెట్టుకొని సీన్ టు సీన్ రీమేక్ చేసేశాడు. సొంత ఐడియాలజీ అనేది కాస్తైనా వాడి ఉంటే దర్శకుడిగా అతడికి కూడా గుర్తింపు లభించేది. సో, ఓవరాల్ గా కన్నడ వెర్షన్ చూడనివారికి ఓ మోస్తరుగా, చూసినవారికి మాత్రం సోల్ మిస్ అయ్యింది అనిపిస్తుంది. ముఖ్యంగా.. ఫస్టాఫ్ మొత్తం కామెడీతో ఆకట్టుకోగా, సెకండ్ హాఫ్ మాత్రం కాస్త బోర్ కొట్టించాడు.
విశ్లేషణ : కాలేజ్ స్టూడెంట్స్ కి, లైట్ కామెడీ ఎంజాయ్ చేసేవారికి “కిరాక్ పార్టీ” భలే నచ్చుతుంది. కానీ.. ఒరిజినల్ వెర్షన్ తో కంపేర్ చేస్తే మాత్రం ఏదో తక్కువైంది అనే భావన కలుగుతుంది.
రేటింగ్ : 2.5/5