రాజశేఖర్ రెడ్డి - జ్యోతి మేఘావత్ రాథోడ్ - తిరుపతి శ్రీనివాస్ రావు (Producer)
హరి గౌర (Music)
రోహిత్ బచ్చు (Cinematography)
Release Date : ఫిబ్రవరి 04, 2025
“కోబలి” అనే టైటిల్ తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఒక స్పెషల్ కనెక్ట్ ఉంది. ఆ టైటిల్ తో సినిమా వస్తుంది అంటే, సిరీస్ వచ్చింది. కొన్ని వందల సినిమాల్లో కీలకపాత్రలు పోషించిన రవిప్రకాశ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ కి రేవంత్ లేవాక దర్శకుడు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ 8 ఎపిసోడ్ల వెబ్ సిరీస్ ఎలా ఉందో చూద్దాం..!!
కథ: సీమలో తన పని తాను చేసుకుంటూ.. ఎవరితోనూ తగువు పెట్టుకోకుండా, తన కుటుంబం జోలికి వచ్చిన వాళ్లకి మాత్రం గట్టిగా బుద్ధి చెబుతుంటాడు శ్రీను (రవిప్రకాష్). అయితే.. అతని తమ్ముడు రాము (తరుణ్ రోహిత్) అనుకోకుండా.. లోకల్ రౌడీ రమణ (రాకీ సింగ్) తమ్ముడితో గొడవ పెట్టుకుంటాడు.
చిన్న గొడవ కాస్తా శ్రీను కుటుంబం మొత్తాన్ని ప్రాణ సంకటంలో పడేస్తుంది. రమణ వర్సెస్ శ్రీనుల యుద్ధంలో ఎవరు ఎక్కువ నష్టపోయారు? ఈ గొడవ మొత్తానికి మూలకారణం ఎవరు? ఈ గొడవ నుండి శ్రీను తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు? వంటి ప్రశ్నలకు సమాధానమే “కోబలి” సిరీస్.
నటీనటుల పనితీరు: 25 ఏళ్ల కెరీర్లో.. రెండొందలకుపైగా సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేసిన రవిప్రకాష్ పేరు తెలియకపోవచ్చు కానీ.. ముఖం చూస్తే మాత్రం వెంటనే గుర్తుపట్టేస్తారు. అలాంటి బ్రాండ్ ఇమేజ్ ఉన్న రవిప్రకాష్ కి కెరీర్ మొత్తంలో పడనన్ని ఎలివేషన్ షాట్స్ ఈ ఒక్క సిరీస్ లో పడ్డాయి. మంచి ఫైట్స్, డైలాగ్స్ & షాట్స్ పడ్డాయి రవిప్రకాష్ కి.
తమ్ముడు రాముగా తరుణ్ రోహిత్ మంచి నటన కనబరిచాడు. మంచితనం, అమాయకత్వం, రోషం వంటి ఎమోషన్స్ ను చక్కగా బ్యాలెన్స్ చేశాడు.
సగటు మహిళగా శ్యామల ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అయితే.. ఆమె పాత్రకు సరైన స్థాయి సీన్స్ పడలేదు. విలన్ గా రాకీ సింగ్ కరడుగట్టిన క్రూరత్వాన్ని ప్రదర్శించాడు. భరత్ రెడ్డి డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో అలరించాడు. మిగతా పాత్రధారులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారనే చెప్పాలి.
సాంకేతికవర్గం పనితీరు: హరి గౌర సంగీతం, రోహిత్ బచ్చు సినిమాటోగ్రఫీ మినహా.. “కోబలి” సిరీస్ మొత్తానికి చెప్పుకోదగ్గ పాజిటివ్ పాయింట్స్ ఏమీ కనిపించలేదు.
దర్శకుడు రేవంత్ లేవాక చాలా చిన్న కథను సిరీస్ లా తీయాలనుకోవడమే పెద్ద మైనస్ అనుకుంటే, కథనంలో కనీస స్థాయి ఆకట్టుకునే అంశాలు లేకపోవడం మరో మైనస్. అనవసరమైన బూతులు, అవసరం లేని రక్తపాతం సిరీస్ లో ఎందుకు ఇరికించాల్సి వచ్చిందో మేకర్స్ కే తెలియాలి. “మిర్జాపూర్” లాంటి సిరీస్ తీయాలని అందరికీ ఉంటుంది, కానీ ఆ సిరీస్ కేవలం బూతులు లేదా శృంగార సన్నివేశాల వల్ల హిట్ అవ్వలేదు.
కథనం కూడా కీలకపాత్ర పోషించింది. దర్శకుడు రేవంత్ ఆ విషయాన్ని గాలికొదిలేశాడు. అందువల్ల మంచి స్టార్ క్యాస్ట్, డీసెంట్ ప్రొడక్షన్ డిజైన్ మరియు చెప్పుకోదగ్గ టెక్నికాలిటీస్ ఉన్నప్పటికీ.. “కోబలి” కనీస స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఈ సిరీస్ ను డైరెక్టర్ ఫెయిల్యూర్ గా పేర్కొనవచ్చు.
విశ్లేషణ: ఓటీటీ స్పేస్ ను కేవలం రక్తపాతం, బండ బూతులు మరియు విపరీత ధోరణి శృంగారానికి కేరాఫ్ అడ్రస్ గా చూస్తుంటారు కొందరు. అయితే.. కేవలం శృంగార సన్నివేశాలు, బూతుల కోసం జనాలు ఓటీటీ సిరీస్ లు లేదా సినిమాలు చూడడం లేదనే విషయాన్ని ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. లేకపోతే.. “కోబలి” లాంటి సిరీస్ లు వచ్చినట్లు కూడా తెలియకుండాపోతాయి. అదృష్టం కొద్దీ ఈ సిరీస్ లో అసభ్యక్రమైన శృంగార సన్నివేశాలు లేవు కానీ.. బోలెడన్ని బూతులు, తలలు నరుక్కోడాలు గట్రాలు గట్టిగా ఉండడంతో ఈ సిరీస్ ను ఫ్యామిలీస్ చూడలేరు, ఇకపోతే.. ఆసక్తికరమైన అంశాలేవీ లేకపోవడంతో రెగ్యులర్ వ్యూయర్స్ కు ఈ సిరీస్ ఫినిష్ చేయబుద్ధి కాదు. మరి హాట్ స్టార్ సంస్థ వరుసబెట్టి ఇలాంటి కంటెంట్ లేని సిరీస్ లతో తమ బడ్జెట్ ను ఎందుకు వృధా చేసుకుంటుందో ఏమో.
ఫోకస్ పాయింట్: మంచి టైటిల్ చెడగొట్టారు!
రేటింగ్: 1.5/5
Rating
1.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus