ఇండస్ట్రీలో రైటర్స్ కష్టాలు ఎలా ఉంటాయో.. దర్శకులుగా మారడానికి వారు పడే ఇబ్బందులు ఏ రేంజ్లో ఉంటాయో.. తాజాగా ఓ వీడియో ద్వారా స్టార్ రైటర్ కోన వెంకట్ (Kona Venkat) వివరించారు. ఈ క్రమంలో ఆయన సందీప్ రెడ్డి వంగా ‘అర్జున్ రెడ్డి’ (Arjun Reddy) సినిమా కోసం పడ్డ కష్టాన్ని తెలిపి షాకిచ్చారు. ‘ ‘అర్జున్ రెడ్డి’ రూ.4 కోట్ల బడ్జెట్లో తీసిన సినిమా. బ్లాక్ బస్టర్ అయిన సినిమా.’.. అక్కడి వరకే మనకు తెలుసు. కానీ ఈ సినిమాని తెరకెక్కించడానికి దర్శకుడు సందీప్ చాలా కష్టపడ్డాడు అని కోన వెంకట్ తెలిపారు.
అతను మాట్లాడుతూ.. “దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) నాకు చెప్పాడు. ‘అర్జున్ రెడ్డి’ కథపై 3 ఏళ్ళు ఓ హీరో ఆఫీస్ లో ఉండి పనిచేశాడు. టైంకి ఫుడ్డు పెడుతున్నారు కదా అని అతను.. ‘మన కథ బయటకు వస్తే చాలు’ అని అనుకున్నాడు. ‘కచ్చితంగా మనం ఈ కథ చేద్దాం’ అని ఆ హీరో చెప్పడం, ఇతను నమ్మడం. అలా మూడేళ్లు అయిపోయింది.
తర్వాత అతనికి చేసే ఉద్దేశం లేదు అని సందీప్ గ్రహించి వేరే హీరో ఆఫీస్ కి వెళ్ళాడు. అతను కూడా ఇతన్ని ఇంకో రెండేళ్లు వాడుకున్నాడు. మొత్తంగా ‘అర్జున్ రెడ్డి’ కథ పట్టుకుని 5 ఏళ్ళ పాటు హీరోల ఆఫీస్..ల చుట్టూ తిరిగాడు. నెల వచ్చేసరికి అవసరాలు ఉంటాయి. డాక్టర్ అయ్యుండి కూడా అతను అన్నేళ్లు ఎదురుచూశాడు అంటే.. అతని తపన అర్థం చేసుకోవచ్చు. ఇక అతను పడే కష్టాలు చూడలేక..
అతని బ్రదర్ నిర్మాతగా మారి ‘అర్జున్ రెడ్డి’ చేయడానికి రెడీ అయ్యాడు. విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కూడా సందీప్ ని బలంగా నమ్మి.. ఆ కథ చేశాడు. తర్వాత అది క్లాసిక్ అయ్యింది. ‘అర్జున్ రెడ్డి’.. సందీప్ 5 ఏళ్ల కష్టం” అంటూ ఎవ్వరికీ తెలియని విషయాన్ని బయటపెట్టారు కోన వెంకట్. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.