రీమేక్ సినిమా… ఒకప్పుడు దీని గురించి పెద్దగా మాట్లాడుకునేవారు కాదు. ఓహో ఆ సినిమాకు ఇది రీమేకా? అని ఓ ప్రశ్న వేసేవారు అంతే. అయితే ఆ తర్వాతి రోజుల్లో పరిస్థితులు మారాయి. ఇప్పుడు రీమేక్ చేస్తున్నారు అంటూ ఓ రకమైన చూపు, ఇంకోరమైన మాటలు వస్తున్నాయి. ఎందుకు రీమేకా చేశామా అని దర్శకనిర్మాతలు, ఆ నటులు తలలు పట్టుకునే పరిస్థితి వస్తోంది. మాతృకతో సినిమాను పోల్చి మరీ కోడి గుడ్డు మీద ఈకలు పీకినట్లు పీకుతున్నారు అంటూ కొంతమంది సినిమా జనాలు కామెంట్లు చేస్తున్నారు.
అయితే, రీమేక్ సినిమాల గురించి నటులు, దర్శకలు చాలాసార్లు స్పందించారు. తాజాగా ‘కోటబొమ్మళి పీఎస్’ దర్శకుడు (Teja Marni) తేజ మార్ని ఆసక్తికర చర్చకు నాంది పలికారు. మంచి కథ ఒక చోట ఆగిపోకూడదు… అది మరింత మందికి చేరువ కావాలనే ఉద్దేశంతోనే రీమేక్‌లు చేస్తుంటాం అని చెప్పిన తేజ… మనకు కథలు లేక కాదు, రాయలేకా కాదు… మనవాళ్లకీ చెప్పాల్సిన కథ ఇదని నమ్మి సినిమాలు చేస్తాం అంటూ రీమేక్‌ల వెనుక ఉద్దేశం చెప్పారు.
టాలీవుడ్‌లో మనం ఇప్పటివరకు చూసి ఆస్వాదించిన సినిమాల్లో రీమేక్ సినిమాలు చాలా ఉన్నాయి. ఒకప్పుడు సినిమాల గురించి ఇంత సమాచారం అందరికీ తెలిసేది కాదు. బాగుంటే బాగుందని, లేదంటే లేదని చెప్పేవాళ్లు. ఇప్పుడు సినిమా గురించి, కథ గురించి ముందే అన్నీ తెలుసుకుని, విడుదల తర్వాత ఒరిజినల్ సినిమాతో సినిమాని పోలుస్తున్నారు. దీంతోనే ఇబ్బందులు వస్తున్నాయి. కథను ఎవరికి నచ్చినట్లు వాళ్లు ప్రజెంట్ చేస్తారు.
అందుకే సినిమాని సినిమాలాగా, ఓ కొత్త కథలాగా ఆస్వాదిస్తే ఎక్కువమందికి నచ్చే అవకాశాలే ఉంటాయి అని చెప్పారు. ఇక ‘కోటబొమ్మాళి పీఎస్’ గురించి మాట్లాడుతూ రీమేక్ అంటే మక్కీకి మక్కీ అన్నట్టు ఉండదని, ‘నాయట్టు’ కథను స్ఫూర్తిగా మాత్రమే తీసుకున్నాంఅని చెప్పారు. శ్రీకాంత్, రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్, వరలక్ష్మి శరత్‌కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఈ రోజు విడుదలైంది.