ఈ మధ్య కాలంలో స్టార్ హీరోల పాత సినిమాలు 4కే టెక్నాలజీతో రీ రిలీజ్ అవుతుండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు. గత నెలలో పోకిరి, ఈ నెలలో జల్సా సినిమాలు రీ రిలీజ్ కావడంతో పాటు కళ్లు చెదిరే స్థాయిలో కలెక్షన్లను సాధించాయి. ప్రభాస్ పుట్టినరోజున బిల్లా మూవీ రీ రిలీజ్ కానుందని ఇండస్ట్రీలో వినిపిస్తుండటం గమనార్హం. అయితే కృష్ణ కెరీర్ లోని హిట్లలో ఒకటైన సింహాసనం మూవీ కూడా రీ రిలీజ్ కానుందని బోగట్టా.
ఎప్పుడు ఈ సినిమా థియేటర్లలో రీ రిలీజ్ అవుతుందో క్లారిటీ లేకపోయినా డాల్బీ డీటీఎస్, 8కే రెజోల్యూషన్ తో ఈ సినిమాను రీ మాస్టరింగ్ చేయిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద ఎన్నో సంచలనాలు సృష్టించిన సింహాసనం సినిమా తొలి 70ఎం.ఎం సినిమా అనే సంగతి తెలిసిందే. అద్భుతమైన కథ, కథనాలతో తెరకెక్కిన ఈ సినిమా 1986 సంవత్సరం మార్చి 21వ తేదీన విడుదలైంది.
ఈ సినిమాలోని ఆకాశంలో ఒక తార పాట ఊహించని స్థాయిలో హిట్టైంది. ఈతరం ప్రేక్షకులు సైతం ఈ పాటను ఎంతగానో ఇష్టపడతారనే సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విక్రమసింహ, అదిత్య వర్ధన అనే పాత్రలలో నటించి కృష్ణ మెప్పించారు. రీ రిలీజ్ లో కూడా ఈ సినిమా కళ్లు చెదిరే స్థాయిలో కలెక్షన్లను సాధించే అవకాశం అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
సింహాసనం సినిమాతోనే స్టీరియో ఫోనిక్ సౌండ్ ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమా ఓపెనింగ్స్ కలెక్షన్ల గురించి అప్పట్లో ఎన్నో కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. బప్పి లహరి ఈ సినిమాకు మ్యూజిక్ అందించగా ఈ సినిమాకు కృష్ణ దర్శకుడు కూడా కావడం గమనార్హం. జయప్రద, రాధ, మందాకిని ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించారు. రాబోయే రోజుల్లో స్టార్ హీరోల మరిన్ని సినిమాలు రీ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.