ప్రముఖ నటుడు, మాజీ కేంద్రమంత్రి కృష్ణంరాజు త్వరలోనే తమిళనాడు గవర్నర్ గా బాధ్యతలు చేపట్టనున్నారని సోషల్ మీడియాలో భారీ ఎత్తున ప్రచారం జరుగుతోంది. జయలలిత మరణం తరువాత తమిళ రాజకీయాల్లో చోటుచేసుకున్న పరిణామాలతో పూర్తిస్థాయి గవర్నర్ ని నియమించడానికి కేంద్రం కసరత్తు చేస్తోంది. తమిళ వారికి దగ్గరైన, అక్కడి రాజకీయ వ్యవహారాలను దగ్గరుండి పరిశీలించిన వ్యక్తి అయితే బెటర్ అని భావించిన కేంద్రం ఫైనల్ గా కృష్ణంరాజు వైపు మొగ్గు చూపుతోంది.
తమిళనాడుతో కృష్ణంరాజుకి పాతికేళ్ల అనుబంధం ఉంది. బీజేపీ సీనియర్ నేతగా ఉన్న ఆయన వాజ్ పేయ్ హయాంలో కేంద్రమంత్రిగా పని చేశారు. దాదాపు తమిళనాడు గవర్నర్ గా కృష్ణంరాజు పేరు ఖరారైందని చెబుతున్నారు. ప్రస్తుతం తమిళనాడు ఇంచార్జ్ గవర్నర్ గా సీహెచ్ విద్యాసాగర రావు న్నారు. గతేడాదితో తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య పదవీకాలం పూర్తయిన తరువాత విద్యాసాగర రావు ఇంచార్జ్ గా వ్యవహరిస్తున్నారు. కృష్ణంరాజు 1998లో కాకినాడ నియోజకవర్గం నుండి 12వ లోక్ సభకు ఎంపీగా ఎన్నికయ్యారు.
అత్యధిక మెజారిటీతో గెలిచి కేంద్రమంత్రిగా బాధత్యలు స్వీకరించారు. ఆ తరువాత నరసాపురం నుండి ఎంపీగా ఎన్నికయ్యారు. మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీ తరఫున పోటీ చేసిన కృష్ణంరాజు ఓటమి పాలయ్యారు. ఆ తరువాత తన సొంతగూడు బీజీపీలో చేరిపోయారు.