రెబల్ స్టార్ కృష్ణంరాజుకు టాలీవుడ్‌లో ఉన్న బెస్ట్ ఫ్రెండ్ అంటే సూపర్‌స్టార్ కృష్ణ అనే చెప్పాలి. వీరిద్దరిదీ 5 దశాబ్దాల స్నేహం. కృష్ణ గారి కంటే కూడా కృష్ణంరాజు… రెండు నెలల ముందు మరణించారు. ఆ టైంలో కృష్ణ గారు నడవలేని స్థితిలో ఉన్నప్పటికీ.. కృష్ణంరాజు భౌతికకాయాన్ని చూడటానికి కృష్ణ వెళ్లి మరీ చూసొచ్చారు. వీరిద్దరి స్నేహం గురించి కృష్ణంరాజు భార్య శ్యామల దేవి గారు చెప్తుంటే చాలా మందికి కన్నీళ్లు వచ్చాయి అనడంలో అతిశయోక్తి లేదు. కృష్ణని తెలుగు చిత్రసీమకు పరిచయం చేసిన సినిమా ‘తేనె మనసులు’.
ఈ చిత్రానికి ముందే కృష్ణంరాజుతో కృష్ణకి పరిచయం ఏర్పడింది. ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కోసం అందరూ కొత్త వారు కావాలని ప్రకటన ఇచ్చి మరీ సెలెక్ట్ చేసుకున్నారు. ‘మూగమనసులు’ తో బ్లాక్ బస్టర్ కొట్టిన ఆదుర్తి… కొత్త వాళ్లతో సినిమా తీస్తున్నారు అని ప్రకటన ఇవ్వడంతో చాలా మంది చెన్నైలో ఉన్న ఆయన కార్యాలయానికి ఫోటోలు పంపారు. ఇంకొందరు స్వయంగా వెళ్లి ఆయన్ని కలిశారు. వీరిని ఆడిషన్స్‌కు పిలిచి ఫైనల్ గా కృష్ణ, సంధ్యా రాణిని ఎంపిక చేసుకున్నారు. కృష్ణంరాజు ఊహించని విధంగా రిజెక్ట్ అయ్యారు.
అయినప్పటికీ కృష్ణ హీరోగా ఎంపికవ్వడంతో కృష్ణంరాజు ఎంతో సంతోషించారు. ఆ వెంటనే కృష్ణతో పాటు మరో 12 మంది స్నేహితులను చెన్నై టీ.నగర్‌లోని ‘క్రిసెంట్ పార్క్’ కి పిలిచి మరీ పార్టీ ఇచ్చారు.కృష్ణకు కోపం కొంచెం ఎక్కువ. అవకాశాలు కోసం తిరుగుతున్నప్పుడు సూటిపోటి మాటలతో వేధించిన వారు కూడా ఆ పార్టీకి వెళ్లారట. దీంతో ఆయన వారి పై కోపం చూపించబోతుంటే కృష్ణంరాజు కంట్రోల్ చేశారట. కొన్నాళ్ళకు ‘చిలకా గోరింక’తో కృష్ణంరాజు కూడా హీరోగా ఛాన్స్ అందుకున్నారు. దీంతో కృష్ణ కూడా చాలా సంతోషించి..
మళ్ళీ తన స్నేహితులకు కృష్ణ గ్రాండ్ గా పార్టీ ఇచ్చి కృష్ణంరాజుని సత్కరించారట. ‘నేనంటే నేనే’, ‘మళ్లీ పెళ్లి’, ‘అమ్మకోసం’, ‘పెళ్లి సంబంధం’, ‘అల్లుడే మేనల్లుడు’, ‘అనురాథ’, ‘రాజ్ మహల్’, ‘అంతా మనమంచికే’, ‘హంతకులు – దేవాంతకులు’, ‘భలే మోసగాడు’, ‘ఇన్స్‌పెక్టర్ భార్య’, ‘ఇల్లు ఇల్లాలు’, ‘తల్లీకొడుకులు’, ‘శ్రీవారు- మావారు’, ‘మమత’, ‘మాయదారి మల్లిగాడు’, ‘స్నేహబంధం’, ‘కురుక్షేత్రం’, ‘మనుషులు చేసిన దొంగలు’, ‘అడవి దొంగలు’, ‘అడవి సింహాలు’, ‘యుద్ధం’, ‘విశ్వనాథ నాయకుడు’, ‘ఇంద్ర భవనం’, ‘సుల్తాన్’ వంటి సినిమాల్లో కృష్ణ – కృష్ణంరాజు కలిసి నటించారు.