ఆరడుగుల అందగాడు కృష్ణం రాజు. ఆయన అందం కంటే ఆవేశమే ఎక్కువమందికి నచ్చింది. ఆగ్రహంతో కృష్ణం రాజు డైలాగ్ చెబుతుంటే థియేటర్లలో చప్పట్లు కురిశాయి. ఎమోషన్ సీన్లలో నటిస్తే మహిళల కంట కన్నీరు ఆగేది కాదు. పౌరాణికం, చారిత్రకం, సాంఘికం.. ఇలా ఒకటేమిటి ప్రతి కథలోనూ తనకే సొంతమయిన నటనతో పాత్రలకు ప్రాణం పోశారు. అభిమానులను సొంతం చేసుకున్నారు. యాభైయేళ్ల సినీ ప్రస్థానంలో197 సినిమాలు చేశారు. 10 సినిమాలు నిర్మించారు. వీటిలో ఎన్నో బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. వాటిలో మరుపురాని కొన్ని చిత్రాలపై ఫోకస్…
1 . చిలకా గోరింకాకృష్ణం రాజు నటించిన తొలి చిత్రం చిలకా గోరింకా. 1966 లో రిలీజ్ అయిన ఈ మూవీతోనే స్టార్ అయిపోయారు. కోటయ్య ప్రత్యాగాత్మ దర్శకత్వంలో వచ్చిన ప్యామిలి డ్రామా ఎంటర్టైనర్ చిత్రంలో అంజలి దేవి, ఎస్ వి రంగ రావు వంటి సీనియర్ నటీనటులతో కృష్ణం రాజు పోటీ పడి నటించి అభినందనలు అందుకున్నారు. చిలకా గోరింకా ఉత్తమ చిత్రంగా నంది అవార్డు అందుకుంది.
2 . కృష్ణవేణిగోపాల కృష్ణ మూవీస్ బ్యానర్ లో వచ్చిన తొలి సినిమా కృష్ణవేణి. వి.మధుసూదన్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కృష్ణం రాజు పక్కన వాణిశ్రీ నటించింది. శరపంజర అనే కన్నడ సినిమాకు రీమేక్ అయినా ఈ చిత్రంలో కృష్ణం రాజు అద్భుతమైన నటన ప్రదర్శించారు.
3 . భక్తకన్నప్పబాపు వెండితెరపై గీసిన చిత్రాలలో భక్తకన్నప్ప ఒకటి. కృష్ణం రాజు భక్తిరసాన్ని అద్భుతంగా పలికించగలరని ఈ మూవీ ద్వారా నిరూపించుకున్నారు. శివుడి భక్తుడిగా రెబల్ స్టార్ నటించిన మూవీ ఆయన కెరీర్లో మరుపురాని చిత్రంగా నిలిచింది. ఈ చిత్రం ఆడియో విభాగంలో జాతీయ అవార్డు అందుకుంది.
4 . అమరదీపందర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో కృష్ణం రాజు నటించిన అమరదీపం మూవీ మహిళల కంట కన్నీరు పెట్టించింది. ఈ చిత్రంలో అతని నటనకు గాను ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్, నంది అవార్డు అందుకున్నారు.
5 . కటకటాల రుద్రయ్యకృష్ణం రాజు కమర్షియల్ హీరో అని చాటిన చిత్రం కటకకటాల రుద్రయ్య. దర్శకరత్న దాసరినారాయణ రావు దర్శకత్వంలో 1978 లో వచ్చిన ఈ మూవీ కలక్షన్ల వర్షం కురిపించింది. 18 లక్షలతో నిర్మితమైన కటకకటాల రుద్రయ్య 75 లక్షలు వసూల్ చేసాడు. అందరినీ ఆశ్చర్యపరిచాడు.
6 . మనవూరి పాండవులుబాపు, కృష్ణం రాజు కాంబినేషన్లో వచ్చిన మరో హిట్ మూవీ మనవూరి పాండవులు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. కటకాల రుద్రయ్య, మనవూరి పాండవులు పది రోజుల తేడాలో రిలీజ్ అయినప్పటికీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి.
7 . రంగూన్ రౌడీనోటిలో బీడీ.. బొత్తాలు విప్పిన షర్ట్.. గరుకు మాటలు.. మోటు ఫైట్లు అచ్చమైన తెలుగు రౌడీగా కృష్ణం రాజు రంగూన్ రౌడీ లో నటించి మాస్ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఓ పాటలో మాడాగా స్టెప్పులు వేసి పడి పడి నవ్వేలా చేశారు.
8 . బొబ్బిలి బ్రహ్మన్నకృష్ణం రాజు చేసిన పాత్రల్లో చిరస్థాయిగా నిలిచిపోయే పాత్ర బ్రహ్మన్న. కట్టు బొట్టు పూర్తిగా భిన్నంగా ఉండి, అదిరిపోయే డైలాగుతో బొబ్బిలి బ్రహ్మన్న గా ఆకట్టుకున్నారు. కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సూపర్ సక్సస్ అయింది.
9 . తాండ్ర పాపారాయుడుస్వాతంత్ర సమర యోధుడు, బ్రిటీష్ వారిని గడగడ లాడించిన తాండ్ర పాపారాయుడు జీవిత గాధను దాసరి నారాయణ రావు సినిమాగా మలిచారు. ఇందులో తాండ్ర పాపారాయుడు గా కృష్ణం రాజు పలికించిన రాజసం అమోఘం. నడక, నడతలో ఆనాటి రాజును కళ్లకు కట్టారు.
10 . బావ బావమరిదికృష్ణం రాజు చిత్రాల గురించి చెపుకునేటప్పుడు బావ బావమరిది మూవీ గురించి చెప్పక పోతే ఆ వ్యాసం సంపూర్ణతను దక్కించుకోదు. 1993 లో వచ్చిన ఈ మూవీలో బావ గా కృష్ణం రాజు మెప్పించారు. సినిమాను సూపర్ హిట్ దిశగా నడిపించారు.
11. ఒక్క అడుగుగోపాల కృష్ణ మూవీస్ బ్యానర్లో సొంత దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఒక్క అడుగు చిత్రాన్ని కృష్ణం రాజు తెరకెక్కించనున్నారు. ఈ చిత్రంలో పవర్ ఫుల్ క్యారెక్టర్లో రెబల్ స్టార్ కనిపించనున్నారు.