తొలి సినిమాతోనే హిట్ కొట్టిన కథానాయికలు మన దగ్గర చాలా తక్కువమంది ఉంటారు. అలా వచ్చిన వాళ్లు మన దగ్గర గతంలో చాలా ఏళ్లు ఉండేవారు కూడా. అయితే ఏమైందో ఏమో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్లు అయినవాళ్లు ఎక్కువ రోజులు ఆ విన్నింగ్ స్ట్రీక్‌ను కొనసాగించలేకపోతున్నారు. అలాంటి కథానాయికల్లో కృతి శెట్టి ఒకరు. ‘ఉప్పెన’ (Uppena) సినిమాతో బేబమ్మగా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తర్వాత ఆ స్థాయి విజయం కాదు కదా.. అసలు విజయమే అందుకోలేకపోయింది.
అయితే, ఏం మ్యాజిక్కో కానీ కృతి శెట్టికి (Krithi Shetty) విజయాలు లేకపోయినా ఎక్కడో చోట అవకాశాలు అయితే వస్తున్నాయి. అలా తెలుగు, తమిళ చిత్రాలతో అలరిస్తూ వస్తోంది. ఈ క్రమంలో మలయాళంలో కూడా అడుగుపెట్టేసింది. టొవినో థామస్‌తో ‘అజయంతే రందం మోషణం’ అనే సినిమాలో నటించింది. సెప్టెంబర్ 12న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా కృతి మీడియాతో మాట్లాడింది. ఈ క్రమంలో టాలీవుడ్‌కు, మాలీవుడ్‌కు మధ్య తేడాను వివరించింది.
‘అజయంతే రందం మోషణం’ సినిమాలో తను పోషిస్తున్న పాత్ర సవాళ్లతో కూడుకున్నదని చెప్పిన కృతి ఈ సినిమాలో మూడు ఇంటర్‌కనెక్టడ్ టైమ్‌లైన్‌లు ఉంటాయని తెలిపింది. ఇండస్ట్రీకి వచ్చిన తక్కువ పమయంలో ఇంతటి గొప్ప సినిమాలో నటిస్తానని అనుకోలేదని సినిమా గురించి భారీ ఎలివేషన్లు ఇచ్చింది కృతి. టాలీవుడ్, మాలీవుడ్ సినిమాల్లో నటించారు కదా.. డిఫరెన్స్ ఏంటి అని అడిగితే ఆసక్తికర సమాధానం ఇచ్చింది.
తెలుగుతో పోటిస్తే మలయాళ పరిశ్రమలో ఎక్కువ సమయం పని చేయాల్సి ఉంటుందని తెలిపింది. దీంతో తాను షూటింగ్‌లో పాల్గొన్న సమయంలో సరైన నిద్ర కూడా లేదు అని చెప్పింది. కొన్ని నెలల పాటు సరైన నిద్ర లేకుండానే పనిచేశానని ఆ రోజులు గుర్తు చేసుకుంది. ఇక చిరంజీవి కొత్త సినిమాను తాను రిజెక్ట్ చేశాననే వార్తలు నిజం కాదని క్లారిటీ ఇచ్చింది. దీంతో కుర్ర హీరోయిన్ మీద వస్తున్న వార్త రూమర్ మాత్రమే.