‘వీడు ముసలోడు కాకూడదే…’ అంటూ థియేటర్లో సందడి చేస్తోంది కృతి శెట్టి. ‘ఉప్పెన’లో ఆమె పాత్ర గోదావరి యాసలో కృతి అభినయం చూసి కుర్రకారు మురిసిపోయారు. అందులో ఆమె గొప్పతనం ఏముంది… డబ్బింగ్ చెప్పింది వేరే అమ్మాయి కదా అనొచ్చు. ఎవరు డబ్బింగ్ చెప్పినా దానికి తగ్గట్టుగా నటించింది కృతినే కదా. ఇదంతా ఇప్పుడెందుకు అంటున్నారా… ఎందుకంటే కృతి తర్వాతి సినిమాలో మరో వేరియేషన్ చూపించబోతోంది. ఈసారి ‘గోదారి’ పిల్ల.. తెలంగాణ పోరి కాబోతోందట.
సుధీర్ బాబు హీరోగా మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే టైటిల్ కూడా పెట్టారు. ఇందులో కథానాయిక పాత్ర నేపథ్యం తెలంగాణ అంట. అంటే తెలంగాణ అమ్మాయిలా కృతి కనిపిస్తుందని అర్థం. బేబమ్మగా ‘ఉప్పెన’లో అదరగొట్టిన కృతి.. ఇప్పుడు నైజాం పోరిగా యాక్ట్ చేయబోతోంది అన్నమాట. మరి ఈసారి ఆమె పాత్రకు ఎవరితోనైనా డబ్బింగ్ చెప్పిస్తారో , లేక సాయి పల్లవిని ఆదర్శంగా తీసుకొని కృతినే డబ్బింగ్ చెబుతుందా అనేది చూడాలి.
ఈ సినిమా కాకుండా కృతి శెట్టి నానితో ‘శ్యామ్ సింగరాయ్’ అనే సినిమాలో నటిస్తోంది. అందులో ఈ రెండు పాత్రలకు భిన్నమైన పాత్రలో కనిపించబతోందని తెలుస్తోంది. అందులో సాయిపల్లవి కూడా నటిస్తోంది. కోల్‌కతా నేపథ్యంలో సాగే సినిమా అని చెబుతున్నారు కాబట్టి… ఇద్దరిలో ఒక హీరోయిన్ బెంగాళీ అయి ఉంటుంది. సాయిపల్లవి ఇప్పటికే ఓసారి బెంగాళీ అమ్మాయిగా నటించింది. కాబట్టి ఆమెనే తీసుకున్నారో లేక… కృతికి ఆ అవకాశం ఇచ్చారో చూడాలి. ఒకవేళ కృతికి ఇస్తే… బేబమ్మ.. బెంగాళీ రసగుల్లాలా కనిపిస్తుందన్నమాట.