నటనలో ఓనమాలు తెలియకుండా అయినా హీరోయిన్లు అయినవాళ్ళు ఉన్నారేమో కానీ.. “క్యాస్టింగ్ కౌచ్” అంటే తెలియకుండా హీరోయిన్లుగా మారిన అమ్మాయి ఒక్కర్తి కూడా ఉండదు అంటే అదేమీ అతిశయోక్తి కాదు. కొందరు మృగాళ్లలో కామ కాంక్ష విపరీతంగా పెరిగిపోవడం, నటీమణులుగా రాణించడానికి అందం మినహా మరో క్వాలిఫికేషన్ లేకపోవడం వంటివి ఈ క్యాస్టింగ్ కౌచ్ రోజురోజుకూ పెరగడానికి గల ముఖ్యకారణాలు. పాపం ఈ క్యాస్టింగ్ కౌచ్ కారణంగా టాలెంట్ ఉన్న అమ్మాయిలు కూడా లొంగకపోతే అవకాశాలు రానట్లే అని భయపడి ఇండస్ట్రీలోకి అడుగిడేందుకు భయపడే స్థాయిలో చిత్రపరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ పేట్రేగిపోతోంది. ఇది కేవలం కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే హీరోయిన్లు మాత్రమే ఎదుర్కొంటున్న సమస్య అనుకొంటే పొరబడినట్లే.. హీరోయిన్లుగా పదుల సంఖ్యలో సినిమాల్లో నటించి.. స్టార్ హీరోల సరసన కథానాయికలుగా జోడీ కట్టిన హీరోయిన్లు కూడా తప్పని బాధంట.
ఈ విషయాన్ని లక్ష్మీరాయ్ స్వయంగా వివరించింది.. ఆమె టైటిల్ పాత్రలో నటించిన తాజా హిందీ చిత్రం “జూలీ 2”. ఈ సినిమాలో హీరోయిన్ గా ఎదగాలనుకొంటున్న ఔత్సాహికురాలి పాత్ర పోషిస్తున్న లక్ష్మీరాయ్ ఇటీవల ముంబై మీడియాతో సినిమా విడుదలను పురస్కరించుకొని ముచ్చటించింది. ఆ సమయంలో ఒక మీడియా ప్రతినిధి.. “మీరెప్పుడైనా ఈ క్యాస్టింగ్ కౌచ్ సమస్యను ఎదుర్కొన్నారా?” అని ప్రశ్నించగా.. క్షణం ఆలశ్యం చేయకుండా “అవును నేనూ బాధితురాలైనే.. అయితే కెరీర్ స్టార్టింగ్ లో మాత్రమే కాదు హీరోయిన్ గా గుర్తింపు వచ్చాక కూడా చాలామంది నన్ను ఆ కోణంలో చూసేవారు, చాలా అసహ్యంగా అనిపించేది” అని కంటతడి పెట్టుకొంది.