“భలే భలే మగాడివోయ్”, “సోగ్గాడే చిన్ని నాయనా”, “శ్రీరస్తు శుభమస్తు” సినిమాలతో మహిళా అభిమానులను అధికంగా సంపాదించుకున్న లావణ్య త్రిపాఠి తాజాగా ఉన్నదీ ఒకటే జిందగీ చిత్రం ద్వారా మరో విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ విజయాన్ని ఆస్వాదించే లోపే లావణ్యను ఓ వార్త తెగ ఇబ్బంది పెడుతోంది. అదేమిటంటే.. లావణ్య త్రిపాఠికి కోలీవుడ్ నిర్మాతల సంఘం 3 కోట్ల జరిమానా విధించారంట. ఎందుకంటే.. “తెలుగులో వచ్చిన “100%లవ్” చిత్రాన్ని తమిళంలో ‘100% కాదల్’గా రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రంలో జి.వి. ప్రకాశ్ హీరోగా నటిస్తున్నారు. హీరోయిన్ గా మొదట లావణ్య త్రిపాఠిని ఎంపిక చేసుకున్నారు. షూటింగ్ సమయానికి లావణ్య సినిమా నుంచి తప్పుకొంది. దాంతో అప్పటికప్పుడు చిత్రీకరణను నిలిపివేయాల్సి వచ్చింది.
లావణ్య తప్పుకోవడం వల్ల నిర్మాతకు 3 కోట్ల వరకు నష్టం జరిగిందని అక్కడి పరిశ్రమ పెద్దలకు చెప్పుకోవడంతో వారు లావణ్యకు జరిమానా విధించినట్లు సమాచారం.” ఈ వార్త రెండు రోజులుగా తెగ చక్కర్లు కొట్టింది. దీనిపై లావణ్య స్పందించింది. ఈ వార్తలో నిజం లేదని స్పష్టం చేసింది. ఇటువంటి వార్తలు ఎవరు పుట్టిస్తారో, ఎందుకు ప్రచారం చేస్తారో తనకి అర్ధం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది.