రాఘవ లారెన్స్ డ్యాన్సర్ గా ఉన్నప్పుడు అతనిలోని ప్రతిభను గుర్తించి మెగాస్టార్ చిరంజీవి ప్రోత్సహించారు. డ్యాన్స్ మాస్టర్ గా అవకాశం ఇచ్చారు. ఆ కృతజ్ఞతతో లారెన్స్ చిరు కోసం ప్రత్యేక స్టెప్పులను కంపోజ్ చేస్తుంటారు. హిట్లర్ లో నడక కలిసిన నవరాత్రి పాటలోని మూవ్ మెంట్, ఇంద్రలోని వీణ స్టెప్పు మెగాస్టార్ కి మంచి పేరుని తీసుకొచ్చాయి. అలాగే ఠాగూర్ లో కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి పాటకు చిరంజీవి వేసిన ప్రతి స్టెప్పు చిన్నపిల్లలను సైతం ఆకర్షించింది.
ఈ పాటల వెనుక లారెన్స్ కృషి ఉంది. వీరిద్దరి కలయికలో మళ్లీ ఓ పాట తెరకెక్కుతోంది. మెగాస్టార్ 150 వ సినిమా ఖైదీ నెం. 150 లోని ఓ మాస్ పాటకు లారెన్స్ డ్యాన్స్ కంపోజ్ చేశారు. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్‍లో వేసిన స్పెషల్ సెట్‌లో ఈ సాంగ్ షూటింగ్ జరుగుతోంది. చిరంజీవి, లక్ష్మిరాయ్‌లపై ఈ పాటను చిత్రీకరిస్తున్నారు. లారెన్స్ కొరియో గ్రఫీకి చిరు స్టైల్ జోడించి స్టెప్పులు వేస్తుంటే సెట్ లో ఉన్న వారికి రెండు కళ్లు సరిపోలేందట. అభిమానులకు ఈ పాట పండుగలా ఉంటుందని చిత్ర బృందం వెల్లడించింది. లైకా ప్రొడక్షన్స్‌తో కలిసి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి(జనవరి 13)కి విడుదల కానుంది.