మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు మెగాస్టార్ చిరంజీవికి తలనొప్పిగా మారనున్నాయా..? అనే ప్రశ్నకు అవుననే సమాధానం ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం. మెగా బ్రదర్ సోదరుడు నాగబాబు ప్రకాష్ రాజ్ కు చిరంజీవి మద్దతు ఉంటుందని ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే చిరంజీవి మాత్రం బహిరంగంగా ప్రకాష్ రాజ్ కు మద్దతు ఇస్తున్నానని ప్రకటన చేయలేదు. కేవలం 900 మంది సభ్యులు ఉన్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి ఏకంగా ఐదుగురు పోటీ పడుతున్నారు.
మంచు విష్ణుకు సీనియర్ నరేష్ మద్దతు ఇస్తుండగా నరేష్ చేతిలో నూరుకు పైగా ఓట్లు ఉన్నాయని తెలుస్తోంది. అయితే మోహన్ బాబు చిరంజీవి మధ్య గతంలో విభేదాలు ఉన్నా ఇప్పుడు వాళ్లు సన్నిహితంగా ఉన్నారనే సంగతి తెలిసిందే. ఎన్నికల్లో మంచు విష్ణు ఓడిపోతే మాత్రం మోహన్ బాబు, చిరంజీవి మధ్య గ్యాప్ పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. చిరంజీవికి పద్మభూషణ్ ప్రకటించిన సమయంలో, వజ్రోత్సవాల సమయంలో తలెత్తిన గొడవలు ఇద్దరి మధ్య దూరాన్ని పెంచిన సంగతి తెలిసిందే.
చిరంజీవి పరోక్షంగా ప్రకాష్ రాజ్ విజయానికి కారణమైనా అది మోహన్ బాబుకు కచ్చితంగా తెలుస్తుంది. ఎన్నికలకు రెండు నెలల సమయం ఉన్న నేపథ్యంలో చిరంజీవి ఏ విధంగా వ్యవహరిస్తారో చూడాల్సి ఉంది. మరోవైపు జీవిత, హేమ, సీవీఎల్ నరసింహారావు సైతం ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధిస్తామని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో విష్ణు పోటీ చేస్తుండటం వల్ల చిరంజీవికి ఇబ్బందులు తప్పవని తెలుస్తోంది.