‘టెస్ట్’ (Test) సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యాడు నటుడు మాధవన్ (R.Madhavan). నయనతార (Nayanthara), సిద్ధార్థ్ (Siddharth) ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు శశికాంత్ (S. Sashikanth) దర్శకుడు. ఈ నెల 4న నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో వరుసగా పాల్గొంటున్న నటుడు మాధవన్ తన పాత రోజుల్ని గుర్తు చేసుకున్నారు. తన తొలి రోజుల్లో నాలుగేళ్ల గ్యాప్ తీసుకోవడం గురించి ఆయన స్పందించారు. సగటు మనిషిలా బయట తిరుగుతూ చాలా విషయాలు తెలుసుకున్నా అని కూడా చెప్పాడు.
రొటీన్‌కు భిన్నమైన పాత్రలు చేయడంలోనే ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటాడు మాధవన్. అందుకే ఒకానొక సమయంలో ఏంటీ తీరిక లేని పని అంటూ విసుగు చెందారట. అదే సమయంలో ఓ వ్యక్తితో స్విట్జర్లాండ్‌లో జరిగిన చిన్న వాగ్వాదం కూడా జరిగిందట. ఓ సినిమాలో పాటకు డ్యాన్స్ చేస్తుంటే ఎవరో వచ్చి నవ్వారట. అది చూసి ఆయన మీద మాధవన్ కోప్పడ్డారట. ఆ తర్వాత తప్పు తెలుసుకుని.. కొన్ని రోజులు సినిమాలకు గ్యాప్ ఇచ్చి.. లైఫ్ ఏంటో చూద్దాం అనుకున్నారట.
అందుకే ప్రపంచాన్ని చుట్టొచ్చే ఆలోచన చేశారట. అలా సగటు మనిషిలా మార్కెట్లకు వెళ్తూ, సామాన్యులతో మాట్లాడుతూ చాలా విషయాలు తెలసుకున్నారట. మార్కెట్‌లో కూరగాయల ధరలు ఎంత ఉన్నాయి, పప్పుల ధరలెంత లాంటివి తెలుసుకునర్నారట. అలాగే రిక్షా నడిపేవాళ్లు ఎలా మాట్లాడతారు? ప్రజలు ఎలాంటి వాటిని ఇష్టపడతారు లాంటి విషయాలు చాలానే తెలుసుకున్నారట. దీంతో వాస్తవం బోధపడింది అని చెప్పారాయన.
అయితే, ఇదంతా ఎప్పుడు జరిగింది, ఆయన అన్నేళ్లు ఎక్కడ బ్రేక్ తీసుకున్నారు అనేది తెలియడం లేదు. ఎందుకంటే ఆయన ఫిల్మోగ్రఫీ అన్నేళ్ల గ్యాప్ అయితే కనిపించడం లేదు. కాబట్టి ఆయన గ్యాప్ అయితే తీసుకున్నారు కానీ.. పూర్తిగా సినిమాలకు కాకుండా, అటు ఇటుగగా తీసుకున్నారు అని చెప్పొచ్చు. ఇంకోసారి ఆయన అందుబాటులోకి వస్తే అదెప్పుడు అనేది తెలుస్తుంది.