ఎన్నో ఏళ్ల క్రితం తమిళనాడు తరలివెళ్లిన తెలుగు వారిని కించపరిచేలా మాట్లాడిన ప్రముఖ నటి కస్తూరి (Kasthuri Shankar) చుట్టూ ఉచ్చు గట్టిగా బిగుస్తోంది. ఇప్పటికే ఆమెకు నోటీసులు ఇవ్వడానికి పోలీసులు ప్రయత్నించగా.. ఇప్పుడు కోర్టులో మొట్టికాయలు పడ్డాయి. బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించిన కస్తూరి మీద హైకోర్టు సీరియస్ అయింది. అలా ఎలా మాట్లాడతారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఆమె అరెస్టు పక్కా అని తేలిపోయింది. చెన్నైలో ఇటీవల జరిగిన ఓ కమ్యూనిటీకి చెందిన సమావేశంలో పాల్గొన్న నటి భాజపా నాయకురాలు కస్తూరి తమిళనాడులో స్థిరపడ్డ తెలుగు వారిపై తీవ్ర విమర్శలు చేశారు.
తమళ రాజ ప్రాసాదాల్లో సపర్యలు చేయడానికి తెలుగువాళ్లు వచ్చారంటూ ఆమె మాట్లాడారు. ఈ విషయంలో ఆమె మీద సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైంది. తమిళనాడులో తెలుగు – తమిళ ప్రజల మధ్య విభేదాలు పెంచేలా ఉన్నాయంటూ ప్రజా సంఘాల అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. దీంతోపాటు రాష్ట్రంలోని వివిధ పోలీసు స్టేషన్లలో కేసులు కూడా నమోదయ్యాయి. తాజాగా ఆమెపై మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
విచారణకు రావాలని సమన్లు అందజేసేందుకు పోలీసులు కస్తూరి ఇంటికి వెళ్ళగా ఇంటికి తాళం వేసి ఉన్నట్లు గుర్తించారు. ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో కస్తూరి అజ్ఞాతంలోకి వెళ్లినట్టు పోలీసులు ప్రకటించారు. ఈలోగా ఆమె అరెస్టు నుండి తప్పించుకునేందుకు ముందస్తు బెయిలు కోసం మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్‌ను ఆశ్రయించారు. ఆమె తరఫున న్యాయవాది విచారణకు హాజరయ్యారు.
కస్తూరి పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన మధురై బెంచ్.. ప్రసంగాల్లో ఆధారాలు లేకుండా అలా ఎలా మాట్లాడుతారని కస్తూరి తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. తమిళనాడుకు వలస వచ్చిన వారిగా తెలుగువారిని ఎలా సంభోదిస్తారని హైకోర్టు వ్యాఖ్యానించింది. తమిళనాడులో తెలుగువారిని, తమిళులను వేరు చేసి చూడలేమని న్యాయమూర్తి అన్నారు. కేసు విచారణను వాయిదా వేశారు. దీంతో ఆమె ముందస్తు బెయిలు రావడం కష్టమే అనే వాదనలు వినిపిస్తున్నాయి.