మన పురాణాలు, మన దేవుళ్లను రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో అంశాలుగా తీసుకోవడమే తప్ప.. వాటిని ప్రధానాంశంగా సినిమాను తెరకెక్కించడం అనేది జరగలేదు. ఈ విషయాన్ని కాస్త సీరియస్ గా తీసుకున్న అశ్విన్ కుమార్ యానిమేటెడ్ వెర్షన్ గా మహావిష్ణువు 9 అవతారాలను సినిమాలుగా ఎనౌన్స్ చేశాడు. అందులో వచ్చిన మొదటి చిత్రమే “మహావతార్ నరసింహ”. ఇండియన్ యానిమేషన్ లో ఇది తొలి అధ్యాయంగా చెప్పుకోవచ్చు. మరి ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకుంది? అనేది చూద్దాం..!!
కథ:
ఇది మనందరం చదువుకున్న, విన్న కథే. దేవుడ్ని సైతం శాసించాలనే థ్యేయంతో హిరణ్యకశిపుడు మహాతపస్సు చేసి.. బ్రహ్మదేవుడిని ప్రసన్న చేసుకుని మనిషి కానీ, మృగం కానీ, ఇంటి బయట కానీ, లోపల కానీ, నేల మీద కానీ, ఆకాశంలో కానీ తనకు మరణం రాదనే వరం అందుకున్నాడు. దాంతో మహాబలవంతుడిగా రూపాంతరం చెందిన హిరణ్యకశిపుడు అసలు మహావిష్ణువు లేడనే ప్రచారాన్ని ప్రారంభించి.. దేవుడ్ని కొలిచే వాళ్లందరినీ చిత్రహింసలు పెట్టడం మొదలెడతాడు.
అయితే.. తన ఇంటనే కయాదు గర్భంలో ప్రహ్లాదుడి రూపంలో మహావిష్ణువు పరమభక్తుడు జన్మించడాన్ని మాత్రం తట్టుకోలేక.. రకరకాలుగా చంపేందుకు ప్రయత్నిస్తాడు.
ఆఖరికి.. మహావిష్ణువు స్వయంగా నరసింహావతారంలో ప్రత్యక్షమై హిరణ్యకశిపుడిని వధించి ధర్మాన్ని కాపాడతాడు.
నటీనటుల పనితీరు:
ఇది యానిమేషన్ సినిమా.. తెరపై కనిపించేవారందరూ సీజీఐతో సృష్టించబడిన పాత్రలు కావడంతో వారి నటన గురించి ప్రస్తావించడం అనవసరం.
సాంకేతికవర్గం పనితీరు:
ఇండియన్ యానిమేషన్ రంగంలో “మహావతార్ నరసింహ” ఓ మంచి ప్రయత్నం అని చెప్పొచ్చు. ఆల్రెడీ గ్రాఫిక్స్ & యానిమేషన్ ఇండస్ట్రీ వేరే స్థాయికి వెళ్లిపోగా.. ఇండియన్ యానిమేషన్ మాత్రం ఇంకా ఇప్పుడిప్పుడే తొలి అడుగులు వేస్తుంది. క్వాలిటీ పరంగా “మహావతార్ నరసింహ” ఇంకా చాలా బెటర్ గా ఉండొచ్చు. ఆల్రెడీ ప్రపంచాన్ని లైవ్ యానిమేషన్, మోషన్ క్యాప్చూర్ టెక్నాలజీ వంటివి రూల్ చేస్తుండగా.. బేసిక్ యానిమేషన్ తో ఆడియన్స్ ను ఆకట్టుకోవాలనేది అత్యాశే అవుతుంది. అయితే.. అశ్విన్ కుమార్ ఆలోచనాశక్తి, ఊహాశక్తిని మాత్రం కచ్చితంగా మెచ్చుకోవాలి. సినిమాటిక్ హై ఇవ్వడం కోసం తీసుకున్న సినిమాటిక్ లిబర్టీస్, ముఖ్యంగా క్లైమాక్స్ యాక్షన్ పార్ట్ చాలా బాగా వర్కవుట్ అయ్యింది. ఇదే సీన్ కంపోజిషన్ కి మోషన్ క్యాప్చుర్ లేదా లైవ్ యానిమేషన్ టెక్నాలజీ తోడై ఉంటే.. ఆడియన్స్ ను ఇంకాస్త బెటర్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ లభించేది.
సామ్ సి.ఎస్ నేపథ్య సంగీతం అవసరమైన ఎలివేషన్ ఇవ్వలేకపోయింది. మిక్సింగ్ బాగున్నప్పటికీ.. సౌండింగ్ మాత్రం ఇంకాస్త బెటర్ గా ఉంటే బాగుండు అనిపించింది. ఇక డబ్బింగ్ కోసం AI టెక్నాలజీ వాడడంతో లిప్ సింక్ బాగానే సెట్ అయ్యింది. డబ్బింగ్ ఆర్టిస్టులందరూ న్యాయం చేశారు.
విశ్లేషణ:
ప్రస్తుత తరానికి మన చరిత్ర, పురాణాలు గురించి తెలియజెప్పడం చాలా అవసరం. వాటిని పాఠ్యాంశాలుగా చెబితే చదివేంత ఓపిక వాళ్ళకి లేదు గనుక.. ఇలా సినిమాగా చెప్పడం అనేది ఉత్తమం. పైన పేర్కొన్నట్లుగా యానిమేషన్ క్వాలిటీ లేదా ఫార్మాట్ లో ఇంకాస్త బెటర్మెంట్ ఉంటే బాగుండేది కానీ.. అశ్విన్ కుమార్ ఊహాశక్తి, అతడు క్లైమాక్స్ సీక్వెన్స్ ను కంపోజ్ చేసిన విధానం మాత్రం మంచి సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. అయితే.. లేజర్ ప్రొజెక్షన్ ఉన్న స్క్రీన్స్ లో సినిమా చూడడం మంచిది. లేదంటే.. ఈ క్వాలిటీ కంటెంట్ ను మామూలు స్క్రీన్స్ లో చూస్తే మజా ఉండదు.
ఫోకస్ పాయింట్: దైవాంశభరిత ఊహాశక్తికి దృశరూపం!
రేటింగ్: 3/5