కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు చేస్తున్న ‘భరత్ అనే నేను’ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ అంచనాలను ఫస్ట్ ఓత్, ‘ది విజన్ ఆఫ్ భరత్(టీజర్)’ మరింత పెంచాయి. మహేష్ అభిమానుల అంచనాలకు మించి సినిమా ఉండేలా కొరటాల తెరకెక్కిస్తున్నారు. మొన్నటి వరకు స్పెయిన్ లో మహేష్, కైరా అద్వానీలపై ఒక రొమాంటిక్ సాంగ్ ని చిత్రీకరించారు. ఏప్రిల్ 5 తిరిగి హైదరాబాద్ కి వచ్చారు. ఇంతటితో ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అయింది. స్పెయిన్ కి వెళ్లకముందే మహేష్ టీమ్ డబ్బింగ్ ని మొదలు పెట్టింది. ఇప్పుడు డబ్బింగ్ చివరి దశకు చేరుకుంది. ఈరోజు హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ఆడియో వేడుక(బహిరంగ సభ) ఉన్నప్పటికీ సాయంత్రం వరకు కొరటాల బృందం డబ్బింగ్ స్టూడియోలోనే ఉన్నట్టు సమాచారం.
తొందరగా ప్రీ ప్రొడక్షన్ పనులు ముగించేస్తే రిలీజ్ సమయంలో టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదని క్షణం తీరికలేకుండా కష్టపడుతున్నారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన మూడు పాటలు యూట్యూబ్ లో రిలీజ్ అయి విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈరోజు మిగిలినవి విడుదల కానున్నాయి. ఇందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మహేష్ బాబు ముఖ్యమంత్రిగా నటించారు. పోసాని కృష్ణమురళి ప్రతిపక్షనేతగా నవ్వులు పండించనున్నారు. నిర్మాత డి.వి.వి. దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 20న రిలీజ్ కానుంది. శ్రీమంతుడు కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ కానుందని సినీ విశ్లేషకులు ధీమాగా చెబుతున్నారు.