“ఫ్యాన్స్ వార్” ఈ పదమేమీ నిన్నమో మొన్ననో పుట్టుకొచ్చింది కాదు. దశాబ్ధాలుగా వింటూనే వస్తున్నాం. అప్పట్లో కులాల విషయంలో జరిగేవి, తర్వాత రాజకీయ నాయకుల కోసం, ఇప్పుడేమో తమ ప్రియతమా సినిమా హీరో కోసం.
దశాబ్ధం క్రితం చిరంజీవి మరియు ఎన్టీయార్ అభిమానుల మధ్య గోదావరి జిల్లాల్లో విపరీతమైన గొడవలు జరిగాయి. చివరికి సదరు కథానాయకులు రంగం లోకి దిగి మరీ చక్కదిద్దే స్థాయికి చేరుకొన్నాయి ఆ గొడవలు. ఇక్కడ హైద్రాబాద్ లో చిరంజీవి-ఎన్టీయార్ లు తమ తమ ఇళ్లళ్ళో ఎంతో హ్యాపీగా సేద తీరుతుండగా.. వాళ్ళ పేర్లు చెప్పుకొని ఫ్యాన్స్ మాత్రం పిచ్చికుక్కల్లా కాదు కాదు పిచ్చెక్కిన మనుషుల్లా కొట్టుకొంటున్నారు. తాజాగా ఇలాంటి పరిణామమే చోటు చేసుకొంది. “సర్దార్ గబ్బర్ సింగ్” సినిమా విడుదలైనప్పుడు పవన్ కళ్యాణ్ మరియు నిర్మాత శరత్ మరార్ ను “ట్విట్టర్” ద్వారా వీరాలెవల్లో క్రిటిసైజ్ చేశారు సో కాల్డ్ మహేష్ బాబు ఫ్యాన్స్. ఆ విషయాన్ని మనసులో పెట్టుకొన్న కొంత మంది పవన్ కళ్యాణ్ అభిమానులు “బ్రహ్మోత్సవం” డిజాస్టర్ అవ్వడంతో.. #FlopUtsavam అనే హ్యాష్ ట్యాగ్ ను ఏకంగా ట్రెండ్ చేసి పడేసారు.
ఈ గొడవను క్యాష్ చేసుకోవాలనుకోంది ప్రముఖ ఆంగ్ల పత్రిక “ఇండీయాన్ ఎక్స్ ప్రెస్”. మహేష్ బాబు మరియు “బ్రహ్మోత్సవం” సినిమా గురించి ట్విట్టర్ లో పలువురు అభిమానులు ఫోటోషాప్ ద్వారా డిజైన్ చేసిన కొన్ని డైలాగ్ పోస్టర్లతో సహా.. ఓ కథనాన్ని ప్రచురించింది. సదరు కథనం మహేష్ బాబునే కాకుండా “బ్రహ్మోత్సవం ” సినిమాను మరియు మహేష్ అభిమానులను తీవ్రంగా హార్ట్ చేసింది. దాంతో ఒక్కసారిగా మహేష్ అభిమానుల కోపం కట్టలు తెంచుకొంది. దాంతో.. ఇవాళ ఉదయం నుంచి #RipIndianExpress అనే హ్యాష్ ట్యాగ్ ను ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ చేసేశారు. అక్కడితో ఆగకుండా ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఆఫీసుకు వెళ్ళి.. రేపటి ఎడిషన్ లో క్షమాపణ పత్రం ముద్రించబడేలా వారి నుంచి మాట సైతం తీసుకొన్నారు.ఈ గొడవంతా చెప్పుకోవడానికి, చూడడానికి బాగానే ఉన్నా.. అసలు ఓ సినిమా నటుడి కోసం కొన్ని వేల మంది తమ పనులు పక్కన పెట్టుకొని ఇలా ట్విట్టర్ లో, ఫేస్ బుక్ లో అనవసర వ్యాఖ్యలు చేసుకుంటూ, గొడవలు పెట్టుకుంటూ ఆఖరికి ఏం సాధించారు.. శూన్యం. ఇకనైనా ఈ తరహా గొడవలు, రచ్చలు చేయకుండా తమ హీరోని ఆరాధిచడంతోపాటు.. అవతలి హీరోని ప్రేమించకపోయినా ద్వేషించకుండా ముందుకు సాగాలని సదరు హీరోల అభిమానులకు మా “ఫిల్మీ ఫోకస్” విజ్ణప్తి చేస్తోంది!