సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ అనగానే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం వీరిద్దరూ చేస్తున్న ‘వారణాసి’ సినిమా గురించి బయటకు వస్తున్న ఒక్కో వార్త ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తోంది. గ్లోబల్ అడ్వెంచర్ గా వస్తున్న ఈ సినిమా కోసం మహేష్ ఒక అరుదైన యుద్ధ విద్యను నేర్చుకున్నారట.
అదే కేరళకు చెందిన ప్రాచీన మార్షల్ ఆర్ట్ ‘కలరిపయట్టు’. సాధారణంగా మహేష్ బాబు సినిమాల్లో స్టైలిష్ యాక్షన్ సీక్వెన్సులు చూస్తుంటాం. కానీ రాజమౌళి విజన్ వేరు కదా. అందుకే ఈసారి మహేష్ తో ట్రెడిషనల్ ఫైట్స్ చేయించడానికి ప్లాన్ చేశారు. దీనికోసం హైదరాబాద్ కు చెందిన ప్రముఖ ట్రైనర్ హరిక్రిష్ కాకాని దగ్గర మహేష్ ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు.
ఈ విషయాన్ని స్వయంగా ఆ ట్రైనరే సోషల్ మీడియాలో రివీల్ చేశారు. మహేష్ తో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ, ఆయన డెడికేషన్ కు ఫిదా అయ్యానని చెప్పుకొచ్చారు. నాజర్ ద్వారా ఈ అవకాశం వచ్చిందని, మహేష్ లాంటి స్టార్ కు ట్రైనింగ్ ఇవ్వడం గర్వంగా ఉందని పోస్ట్ చేశారు. మహేష్ తన కెరీర్ లో ఇప్పటివరకు ఇలాంటి పురాతన యుద్ధ విద్యలు ప్రదర్శించింది లేదు. తెరపై ఆయన కలరిపయట్టు విన్యాసాలు చేస్తుంటే చూడటం ఫ్యాన్స్ కు ఒక కొత్త అనుభవం కాబోతోంది.
అడవుల నేపథ్యంలో సాగే యాక్షన్ సీన్ల కోసం దీన్ని వాడుతున్నట్లు తెలుస్తోంది. ఈ భారీ చిత్రంలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో రాబోతోంది. మొత్తానికి జక్కన్న చెక్కితే మహేష్ ఎలా ఉంటారో చూడాలని వెయిట్ చేస్తున్న వారికి ఈ అప్డేట్ ఫుల్ కిక్ ఇచ్చింది. గ్లోబల్ కటౌట్ కు లోకల్ విద్య తోడైతే రికార్డులు బద్దలవ్వాల్సిందే.
