కరోనా.. చాలా సినిమాల విడుదల తేదీలు మార్చేసింది, షూటింగ్ ప్లాన్స్‌లో మార్పులు చేసేలా చేసింది. ఇప్పుడు ఏకంగా ఓ సినిమా బ్యాక్‌డ్రాప్‌నే మారుస్తోంది. అందులో అది స్టార్ హీరో సినిమా కావడం ఇక్కడ విశేషం. అవును కొవిడ్ పరిస్థితుల కారణంగా మహేష్‌బాబు ‘సర్కారు వారి పాట’ బ్యాక్‌డ్రాప్‌ను అమెరికా నుంచి దుబాయికి మార్చేస్తున్నారట. చిత్ర దర్శకుడు పరశురామ్ ప్రస్తుతం అదే పనిలో ఉన్నాడు. ఆ లెక్కన సినిమా షూటింగ్ కూడా దుబాయిలో చేస్తారనేది కొత్తగా చెప్పక్కర్లేదు.
‘సర్కారు వారి పాట’ సినిమాను తొలుత అమెరికా బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందని తొలుత అనుకున్నారు. దీని కోసం అమెరికాలో నెల రోజుల భారీ షెడ్యూల్ కూడా అనుకున్నారు. అయితే ఇప్పుడు కరోనా కారణంగా దానికి దుబాయికి మార్చేశారు. అక్కడే చిత్రబృందం నెల రోజుల పాటు చిత్రీకరణ జరుపుతుందట. ఈ నెల 25 నుంచి చిత్రీకరణ దుబాయిలో స్టార్ట్ చేస్తారట. అక్కడ పూర్తయ్యాక తిరిగి హైదరాబాద్ వచ్చిన ప్రధాన టాకీ పార్టును పూర్తి చేస్తారట. బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టే బడాబాబుల నేపథ్యంలో సినిమా ఉండబోతోందని టాక్. అందులో పరశురామ్ స్టయిల్ వినోదం ఎలాగూ ఉంటుందనుకోండి.
మహేష్‌బాబు సుమారు 13 నెలల తర్వాత సెట్స్ అడుగుపెడుతుండటం విశేషం. డిసెంబరు 2019లో ‘సరిలేరు నీకెవ్వరు’ షూటింగ్ పూర్తి అయ్యాక … మూడు నెలలకు ‘సర్కారు వారిపాట’ మొదలుపెడదాం అనుకున్నారు. తీరా అంతా సిద్ధం చేసుకునే సరికి కరోనా పరిస్థితులు వచ్చేశాయి. దీంతో సినిమా వాయిదా పడుతూ, వాయిదా పడుతూ ఇప్పటికి కుదరిఇంది. మరోవైపు దర్శకుడు పరశురామ్ అయితే రెండున్నరేళ్ల గ్యాప్ తర్వాత మెగాఫోన్ పట్టుకోబోతున్నాడు. ‘గీత గోవిందం’ వచ్చి అన్ని రోజులు అయింది మరి.