టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం కోసం కేవలం ఆయన అభిమానులు మాత్రమే కాదు.. మొత్తం తెలుగు సినిమా ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చాలా రోజుల తరువాత మహేష్ బాబు కంప్లీట్ మాస్ సినిమా చేస్తుండడంతో.. ఇంత హైప్ ఏర్పడిందని చెప్పొచ్చు. సంక్రాంతికి ఇలాంటి మాస్ సినిమాలే ఎక్కువ ఆడతాయి కాబట్టి.. ఈ చిత్రం కూడా మంచి వసూళ్ళను రాబడుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు చిత్ర యూనిట్ సభ్యులు. కేవలం 6 నెలల్లోనే ఈ చిత్రాన్ని ఫినిష్ చేసాడు మహేష్ బాబు.
దిల్ రాజు, అనిల్ సుంకర కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి గాను మహేష్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడు అనే విషయం చర్చలు జరుగుతున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం.. మహేష్ కు 40 కోట్లవరకూ ముట్టిందట. ఈ చిత్రం కోసం నేరుగా పారితోషికం తీసుకోకుండా.. శాటిలైట్ రైట్స్ .. డిజిటల్ రైట్స్ .. హిందీ డబ్బింగ్ రైట్స్ ను తీసుకున్నాడట మహేష్. వీటిని మొత్తం ‘సన్ టీవీ’ వారు 30 కోట్లకు కొనుగోలు చేశారని తెలుస్తుంది. ఇక హిందీ డబ్బింగ్ రైట్స్ రూపంలో 15 కోట్లు వచ్చాయి. ఈ మొత్తంలో జీఎస్టీని మినహాయిస్తే.. 40 కోట్ల వరకూ మహేష్ కు ముట్టాయని సమాచారం. మహేష్ కెరియర్లోనే అత్యధిక పారితోషికం ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రానికే దక్కిందనేది ఫిలింనగర్ టాక్.