వెండి తెరపై నీతులు అందరూ చెబుతారు. వాటిని నిజ జీవితంలో కొంతమందే పాటిస్తారు. అలాంటి వారిలో మహేష్ బాబు ఒకరు. శ్రీమంతుడు సినిమాలో సొంత ఊరుని దత్తత తీసుకొని అభివృద్ధి చేయాలనీ చెప్పిన అతను.. రియల్ లైఫ్ లోను తన తండ్రి సొంత గ్రామమైన బుర్రిపాలెం (గుంటూరు జిల్లా)ని దత్తత తీసుకొని, అభివృద్ధి పనులు చేపట్టి నిజమైన శ్రీమంతుడు అనిపించుకున్నారు. కొన్నేళ్ల క్రితం బుర్రిపాలెంతో పాటు తెలంగాణలోని సిద్ధాపూర్ (మహబూబ్ నగర్) గ్రామాన్నిదత్తత తీసుకొని వాటిని ఆదర్శవంతంగా తీర్చి దిద్దాలని సంకల్పించారు. కేవలం ఆర్ధిక సాయం అందించి వదలకుండా అన్ని విభాగాల్లో అభివృద్ధి కోసం నిపుణులతో ప్రణాళిక రచించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ రెండు గ్రామాల స్థానికులతో మాట్లాడి సమస్యలను తెలుసుకొని పరిష్కార దిశగా అడుగులు వేస్తున్నారు.
ఈరోజు బుర్రిపాలెంలో సూపర్ స్టార్ కృష్ణ గారి తల్లి, మహేష్ బాబుకు నానమ్మ అయిన నాగరత్నమ్మ గారి పేరు మీద నిర్మించిన స్కూల్ బిల్డింగ్ ప్రారంభించారు. వందల మంది చిన్నారులు ఇందులో విద్యాబుద్ధులు నేర్చుకోనున్నారు. ఆ స్కూల్ బిల్డింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మహేష్ సేవా గుణాన్ని అభినందిస్తున్నారు. ఈ గ్రామంలోనే కాకుండా సిద్దాపూరులో బెంగళూరులోని ఓ పాఠశాల భవనం నమూనా ఆధారంగా అత్యాధునిక పాఠశాల భవనం నిర్మాణం జరుగుతోంది. ఆ పాఠశాల కూడా త్వరలోనే అందుబాటులోకి రానుంది.